పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

గోన గన్నా రెడ్డి

పొందెను. మంజీర దాటడంలో చౌండసేనాని ఏటి ఆవలనుంచి, ఏటి ఈవలనుంచీ గోనగన్నయ్య శౌణదేశవాహినులను చీల్చి చెండాడిరి. ఏటిలో యాదవుల పడవలను వందలకొలది ముంచినారు. గట్టుకు దిగకుండ గట్టుపైన చౌండసేనాని బలాలు మహదేవరాజు మూకలను శకలాలుగా ఖండించివేసెను.

ఏరుదాటి చూచుకొనేసరికి దాదాపు ఎనభై వేలమంది మనుష్యులు. డెబ్బది రెండు ఏనుగులు, రెండువేలచిల్లర గుఱ్ఱాలు యాదవులకు నష్టమయ్యెను. గాయపడినవారు లక్షకుపైగా ఉన్నారు. చాలా ఆహారపదార్థాలు నష్టమాయెను.

ఏరుదాటగానే చౌండసేనాని సేనలు వెనక్కు తగ్గిపోయాయి. గన్నారెడ్డి గజదొంగలు రెండుభాగాలై ఒకటి గన్నారెడ్డి నాయకత్వాన మరొకటి విఠలధరణీశుని నాయకత్వాన శౌణమహాదేవుని వెన్నాడించడము, అడ్డు తగలడము మొదలిడెను.

ఒక బలాన్ని నాశనంజేయవలెనని సాగినచో మహాదేవునికి ఆ బలం కనబడదు. సరేనని నిర్భయంగా సాగితే రెండవ గన్నారెడ్డి ధ్వజం అడ్డం. వెనుక నుంచి చౌండసేనాని చమువులు నిరంతరపుతాకిడి.

ఇంతలో వానలు ప్రారంభించాయి. వానలో గన్నారెడ్డికి బలం ఎక్కువా అన్నట్టు ఆతడు ప్రచండంగా విజృంభించి అడుగడుగునకు నాశన దేవతను ప్రయోగం చేస్తున్నాడు. చిన్నచిన్నఏళ్ళు, బలాలు ఉండడానికి తగిన నీళ్లు లేకపోవడం, రోగాలు జ్వరాలు అన్నియు నిరోధాలే!

మహాదేవరాజునకు వచ్చేది వానాకాలమని తెలియును. అందుకు తగిన సన్నాహాలతోనే యుద్ధయాత్ర ప్రారంభించినాడు. కోట్లకొలది చాపలను, వెదురు ఊచలనుకూడా పట్టించుకొని వచ్చినాడు. దానితో లక్షలకొలది నివేశాలు నిర్మించడం, వానలు వెలిసిన వెనుక ముందుకు సాగడం, ఈ రీతిగా అంచెలుగా యుద్ధయాత్ర సాగుచున్నది. గోన గన్నారెడ్డి బలాలు, చౌండుని బలాలు యాదవుని వాహినులను నాశనం చేస్తున్నవి.

ఎప్పుడు ఓరుగల్లు చేరుదుమా, ఎప్పు డా మహానగరం చుట్టూఉన్న పాళెములన్నీ ఆక్రమించుకొని, తాను నిశ్చయించుకొన్న వ్యూహం ప్రకారం ముట్టడి సాగించడమా అని తహతహ జనించినది మహదేవరాజునకు! నెల ముట్టడి సాగేసరికి ఆంధ్రులు కాళ్ళబేరానికి వత్తురు. ఆడదాని రాజ్యం అంటే అసహ్యము కొలది తనతో కలిసిపోదురు.

ఈలాంటి ఆశతో ఏమాత్రమూ పట్టుదల, యుద్ధపుబిగి సడలకుండా మహాదేవరాజు ప్రయాణం చేస్తున్నాడు. మహావాహినులతో.

గన్నారెడ్డి అంతకన్నా పట్టుదలతో, మాయతో, అఖండవేగంతో పిడుగులా శౌణ మహాదేవరాజు సైన్యాన్ని తాకుతాడు; కొంత సైన్యం నాశనంచేస్తాడు; ఆ వెంటనే మాయమవుతాడు.