పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవులు

263

గన్నారెడ్డి విధానం అర్ధంచేసుకొని మహాదేవరాజు, కొన్ని కొత్త రక్షణలు సృష్టించాడు. రాళ్ళచక్రాలున్న కొండల్లాంటి బళ్లు కట్టించాడు. ఆ బళ్ళ పైన చిన్న చిన్న కఱ్ఱకోటలు, ఎనమండుగురు పదిమంది పట్టేవి కట్టించాడు. ఆ రథాలను ఎనిమిది ఎద్దుల జతలు లాగుతూఉంటాయి.

బండిమీద చిన్న కఱ్ఱకోట గోడలలో ఉన్న వీరులు బాణాలు వేయడానికి పెద్ద రంధ్రాలు చేయించినాడు. వీరిని సేనలచుట్టూ మహదేవరాజు ఉంచినాడు. విరోధి కనపడగానే, శత్రువునుచూచి కోటలబండ్లు ఆపు చేయించి వానిని కోట గోడలులా చేశాడు. ఈ ఏర్పాటు గన్నారెడ్డి బాగా అర్థంచేసుకున్నాడు. యుద్ధ చమత్కృతి అంతా ఎత్తుకు పైఎత్తులు వేయుటలోనే ఉంది.

గన్నారెడ్డి అక్కినప్రగడనుచూచి, “బావగారూ! ఇంతవరకు మన సైన్యాలు నాశనం కాకుండా విరోధి నాశనం అయేటట్టు చూస్తున్నాము. ఇప్పుడు ఈ యాదవుడు మంచిఎత్తే వేసినాడు” అని ఆలోచన చేసెను. గన్నారెడ్డి ఆ మాటలు అనగానే అక్కినప్రగడ నవ్వి “బావగారూ! మీకు గజదొంగలని పేరు ఊరికే వచ్చిందా? ఆలోచించండి ఒక కొత్తఎత్తు” అన్నాడు.

మహాదేవరాజు ఆరులక్షలమహావాహిని వేములవాడదగ్గర విడసి యున్నది. రెండులక్షలసేన ఇంతవరకు నాశనమయినది. వేములవాడ చుట్టుప్రక్కల గ్రామాలన్నియు మహాదేవరాజు సైన్యాలు ఆక్రమించాయి. వేములవాడకు ఉత్తరంగా పన్నెండు గవ్యూతుల దూరములో జగతపురిలో మాల్యాల చౌండసేనాపతివున్న శిబిరంలోనికి అక్కినప్రగడకూడరాగా చౌండమహారాజుతో మాటలాడటానికి గన్నారెడ్డి యేగెను.

3

చౌడసేనాని ఎనుబదిఏళ్ళ వృద్ధమహారాజు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి రాజ్యభారంపూని విజృంభించి, ఆంధ్రమహాదేశం అంతా కాకతీయ సామ్రాజ్యము వ్యాపింపచేసే సంవత్సరాలలో కొఱవి రాజ్యభారము వహించి ఉత్తరాంధ్రభాగములలో గోదావరి రెండుతీరాలలో శౌణ యాదవులు, గోండులు మొదలగువారు దాడులు వెడలకుండా రక్షిస్తూ, తన చక్రవర్తితో దక్షిణదేశ యుద్ధయాత్రకు, కమ్మనాటి యుద్ధయాత్రకు వెళ్ళి, యుద్ధక్రియా దక్షుడై చక్రవర్తి కుడిభుజమై, సంకినపురరిపుతిమిరమార్తాండ, సమరదేవేంద్ర, పెదముత్తుగండ, కోటగెలవట, దీపలుంఠక, దుష్టతురగరేఖారేవంత, గణపతిదేవ ప్రసాదౌత్తర రాజ్యలక్ష్మీ సమాశ్లిష్ట, రుద్రేశ్వర దేవశ్రీ పాదపద్మా రాధక, నిఖిల శత్రురాజమస్తక విదారణ, సకలాయుధప్రయోగకుశల, శౌణ దేశాధీశాది భుజబల గర్వాపహరణ మొదలయిన