పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

గోన గన్నా రెడ్డి

సర్వమాధుర్యాలు ఉత్తంగతరంగాలై సుడులు తిరిగి, ఆ సుళ్ళమధ్య లయాత్మకమై వేయిరాగాలు సంశ్లేషింప, సర్వవర్ణపూరితయై ఏకావీరాదేవి నాట్యం చేస్తున్నది. ఆ పరమపవిత్రదర్శనమున పరవశయైన అన్నాంబిక హృదయాన కంఠమాలనుండి ఒక పుష్పము ఎగిరివచ్చి వ్రాలి కరిగి హృదయంలో లీనమైనట్లుతోచి అన్నాంబిక చైతన్యరహితురాలైనది. ఇరువురు ఒక్కసారి కనుల ఆనందబిందువులునిండ రెప్పలు తెరచినారు.

4

ఏకవీరాదేవి పూజలు పూర్తిచేసుకొని రుద్రదేవి, అన్నాంబికా, ముమ్మడాంబలతో మొగలిచర్లనుండి సాయంకాలమున బయలుదేరెను. రుద్రదేవి, ముమ్మడమ్మ, అన్నాంబిక నాలుగు అశ్వములు పూన్చిన రథముపై అధివసించి ముందు వెనుకల అశ్వికులు కొలిచిరా ప్రయాణము సాగించిరి. రేచర్ల రుద్రారెడ్డినాయుడు అంగరక్షకులకు నాయకుడై అప్రమత్తుడై ఉండెను.

ఆ వానకారున సస్యశ్యామలమై దేశం పచ్చని క్రొత్తవస్త్రము కట్టుకొన్న యిల్లాలులా కలకలలాడుచున్నది. వాన కురియబోయె ఉక్కపోతలతో ప్రజలందరకు చెమటలు పోస్తున్నవి. పొలాలలో రైతులు వ్యవసాయమనే దివ్యయజ్ఞాలు ప్రారంభించినారు. వానకోయిల అరుపులు, ఆలమందల అంభారవాలు, రైతులు అదలింపు కేకలు మందరశ్రుతిజనిత కాంభోజరాగమై ఆ సాయంకాలాశావలయమున నిండినది.

ముమ్మక్కదేవి, అన్నాంబిక, రుద్రదేవి - యాదవమహాదేవునివల్ల సంభవించబోయే దారుణ యుద్ధము, భయంకర రక్తపాతము, ప్రాణనాశము, ప్రజా సంక్షోభములనుగూర్చి మాట్లాడుకొనుచుండిరి.

రుద్రా: చెల్లీ! యుద్ధాన విజయం తెచ్చేవి రెండు. ఒకటి ఎదుటివాడిబలం సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం. రెండవది ఎదిరి బలాన్నిబట్టి మనం వ్యూహరచన చేసుకోవటం.

అన్నాం: అక్కగారూ, వ్యూహరచనలో భేదము లుంటాయనా మీ ఉద్దేశము.

రుద్రా: అవునమ్మా చెల్లీ! యెదుటివాడిబలం ఎక్కువయితే ఆత్మరక్షణ కొరకు వ్యూహాన్ని రచించుకొని, యెదుటివాడిబలం మనలను తాకినకొలదీ నానాటికి హీనమయ్యేటట్టు చూడాలి. నీరసించినాడని తెలియగానే శత్రువుపై విజృభించి నాశనం చేయాలి.

ముమ్మక్క: అక్కగారూ! శత్రువుయొక్క బలమే తక్కువగా ఉండి మన బలం ఎక్కువగా ఉంటుంది; శత్రువు దుర్భేద్యమైన వ్యూహం రచించుకొని వుంటాడు. అప్పుడు శత్రువుమీదికి వెళ్ళడము మనకు నష్టమే కదా!