పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

251

రుద్ర: నిజమే. అప్పుడు సర్వకవచభేదకమైన యుద్ధవిజృంభణ సాగించి శత్రునాశనం చేయాలి, ఈ రెండు యుద్ధాలలో గన్నారెడ్డి అసమాన ప్రజ్ఞావంతుడు,.

అన్నాం: గన్నారెడ్డిది దొంగపోటుగాదా, అక్క గారూ!

రుద్ర: గన్నారెడ్డిని యెవరైనా గజదొంగ అంటే చీల్చేసేదానివి, ఇప్పుడు ఇలా అంటవేమి చెల్లీ!

ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. రుద్రదేవి ప్రేమతో అన్నాంబికను, ముమ్మక్కను కౌగలించుకొని, ‘చెల్లీ! మనుష్యునిజ్ఞానం ఎంత సంకుచితమైనది! మూడడుగులు ముందుకు, వేయి అడుగులు వెనక్కు చూడలేని అజ్ఞానంతో నిండి ఉంటాడు సర్వవిశ్వమూ ఆవరించిఉన్న పరమ రహస్యాల ఛాయలన్నా మనకు తెలియవుసుమీ.

రుద్రాంబికాదేవి నిట్టూర్పు విడిచింది. తమ పరితాపాలన్నీ మరచి పోయి ఏవో ఆలోచనలలో అన్యమనస్క లైఉన్న వారి మువ్వురకు ఒక్క సారిగా వేయి పిడుగులు విరిగిపడినట్లు గగ్గోలు వినబడింది. నాలుగువేలమంది సైనికులు రుద్రదేవి రథమును, అంగరక్షకురను చుట్టుముట్టారు. అంగరక్షకులను ఇనుప గోడలా చేసి, రుద్రసేనాని రథాన్ని ఆపుచేసి ముందు నుంచున్నాడు. హరిహరదేవ, మురారి దేవులు రుద్రసేనాని ముందర ఆగినారు.

మహావీరుడును, యువకుడు అయిన రుద్రసేనాని హరిహర మురారి దేవుల ఉద్దేశము కనిపెట్టి, తానెన్నడూ పొందని భయముచే గజగజ వణకిపోయినాడు. ‘శ్రీశ్రీ రుద్రదేవి చక్రవర్తికి ఎలాంటి ఆపద కలుగుతుందో! ఎప్పడూ ఊహించ లేని విధంగా ఈ ఆపద వచ్చిపడిం’దని రుద్రసేనాని కళవళ పడుచున్నాడు.

హరిహరదేవుడు ఉచ్చైస్వనంతో - రేచర్ల రుద్రదేవుల వైపు చూస్తూ, ‘ఓయి రేచర్లరుద్రుడా! నువ్వేమిచేయగలవు? మే మిరువు రన్నదమ్ములము ప్రాణాలకు తెగించినవారము. మృత్యుదేవతాస్వరూపులు మా నాలుగువేల మంది సైనికులు. కాబట్టి నీవు నీ ప్రాణం దక్కించుకొని వెళ్ళిపో. మేము మా చెల్లెలు రుద్రదేవిని మా కోటకు బందీగా తీసుకొనిపోతున్నాము’ అని తెలిపినాడు.

రుద్రదేవికి, అన్నాంబికకు, రేచర్ల రుద్రునికి - ఎవరికీ నోట మాట రాలేదు. మురారిదేవుడు వెడనవ్వు నవ్వుచు ‘సకల జంబూద్వీపానికి మకుటమయిన ఆంధ్రదేశాన ఆడది రాజ్యం చేయడానికి ధర్మం ఒప్పుకోదు. రుద్రచక్రవర్తి వెనుక సింహాసనం అధివసించవలసినది మా తండ్రిగారు. దొంగలై, అధర్మపూర్ణులై మహాదేవరాజూ, గణపతిదేవుడూ సింహాసనా లెక్కినారు. అయినా ధర్మస్వరూపులు అపరజినదేవులు అయిన మా తండ్రిగారు మాటలాడక, లెక్కచేయక ఊరుకొన్నారు.