పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

249

అన్నాంబిక: అక్కగారూ! ఈ శిల్పి ప్రతిభ అనన్యంగా కనిపిస్తున్నది. ఈయన దేవాంశసంభూతుడై ఉండాలి అక్కగారూ. ఆ లతలు మొలిచినట్లున్నవే గాని మలిచినట్లు లేవు.

రుద్ర: ద్వారఫలకం పైన దేవీనాట్యం ప్రత్యక్షమవుతుంది.

అన్నాం: ఆ నాట్యసౌందర్యం శరత్పూర్ణిమలా లోకాలు ఆవరిస్తున్నది.

రుద్ర: అమృతగంగ శివుని జటలలో అవతరించినట్లుంది.

అన్నాం: సృష్టిమూలమైన త్రిభంగములో ఆ దేవి చిరునవ్వు నవ్వుతున్నది.

రుద్ర: దేవీభాగవతంలో దేవిని నాట్యకళోద్భవ అన్నాడు వేదవ్యాసులు.

అన్నాం: ఆమె నవ్వు వెన్నెలగా, ఆమె చూపువెలుగుగా....

రుద్ర: ఆమె మోము ఆకాశముగా, వంగిననడుము త్రిభువనాలుగా...

అన్నాం: ఆమె స్తనములు సర్వకళలుగా, కంఠము భక్తిగా....

రుద్ర: ఆమె భుజములు శాస్త్రాలుగా, ఆమె చేతులు విజ్ఞానవిచారణగా....

అన్నాం: ఆమె నాభి మాయావర్తంగా...

రుద్ర: ఆమె పెదవులు సర్వరసాలై..

అన్నాం: ఆమె కటి సర్వప్రేమలై, ఆమె ఊరువులు సకలాధారాలై...

రుద్ర: జంఘలు జీవమై...

అన్నాం: ఆమె సర్వవిశ్వమై...

రుద్ర: ఆమె నాట్యమే సృష్టి స్థితి లయాలై..

అన్నాం: జయ! జయ! సకల భావరూపా!

రుద్ర: జయ! జయ! లాస్య నాట్య తాండవమూర్తీ!
        జయ జయ ఏకవీర! మా అనుగుతల్లీ!
        జయ మమ్మా నీకు మేము బిడ్డలమమ్మా!

జేగంటలు మ్రోగునవి. వా రిరువురు నిమీలితనేత్ర లైనారు. త్రిభంగాకారయైన ఏకవీర తప్తజాంబూనదాభయై, కాంచనారుణపరిధానయై, జ్వలితాగ్ని శిభాభ సర్వభూషణ భూషితయై రుద్రాంబకు ప్రత్యక్షమైనది. ఆమె విశ్వనాట్యము చేస్తున్నది. ఆమె లలితపదగతులకు వేణుగానాలవలె, చిగురు జొంపాలువలె హస్తములు ఆడుతున్నవి. ఆ మూర్తి కన్నులనుండి ఒక మహాతేజం రుద్రాంబ హృదయంలో ప్రవేశించి లయించినట్లయింది. రుద్రదేవి సర్వ విశ్వమధ్యస్థయై పులకరించిపోయి, ఏదో దివ్యమత్తతలో ఒక లిప్తమాత్రము చైతన్యరహితయైనది.