పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

గోన గన్నా రెడ్డి

కాని ఇక్కడ ఎన్నోచిక్కులు తటస్థించాయి. పురుషులు, ఇరువురు ముగ్గురు స్త్రీలను ప్రేమించగలరు. కాని స్త్రీ తన జన్మలో ఒక్క పురుషునే ప్రేమించగలదు! అయినా పురుషులలో మహోత్తములు మాత్రమే ఏకపత్నీవ్రతస్థులు కాగలరు. - శ్రీరాముడు, నలుడు, సత్యవంతుడు మొదలయినవారు. మహాప్రభూ! తామెందుకు ఇంతవరకూ వివాహం చేసుకోలేదు? మీచరిత్ర అంతా నాకు పూర్తిగా అర్థం అయింది. అనేకమంది రాజకుమారులు వివాహం చేసుకోకముందు తమ అంతఃపురంలో ఉన్న సుందర బాలికలతో క్రీడించి తమ మదనజ్వర తాపానికి మందు సంతరించుకొందురు. తాము ఇంతవరకు ఒక స్త్రీనైనా కన్నెత్తి చూడలేదు. మహారాజా! నేను మీకు తండ్రివంటివాడను. నాదగ్గర సందేహించకుండా నిజం తెలియ జేయండి. మీరు మా మహారాణి రుద్రమదేవిని ప్రేమిస్తున్నారు. అది నిజం! ఒక మహారాజ్యానికి ఉత్తమస్త్రీ ఒకర్తు సామ్రాజ్ఞి కానుండడం అపూర్వం. అది తమ మనస్సును మిక్కిలి రజింపజేసింది. ఉత్తమప్రేమ అనే దివ్యానుభూతి మానవ జీవితంలో కలగడం అపురూపం. ఆ సన్నివేశం లభించిన నాయికా నాయకుల చరిత్రలు పురాణాల కీర్తింపబడతాయి. సావిత్రీ సత్యవంతు లొకరికొరకు ఒకరు ఉద్భవించారు. ఒకరినొకరు చూచుకొన్నారు; ప్రేమించారు. వారి ప్రేమను కాలుడుకూడా విచ్ఛిన్నం చేయలేకపోయాడు. మహారాజా! మిమ్ము రుద్రమదేవి మహారాణి ప్రేమిస్తున్నారు. మీప్రేమను సామ్రాజ్యాలు, రాజనీతులు అడ్డుకోలేవు!

వీర: గురుదేవా! నేను తమ ఆజ్ఞానువర్తిని.

శివ: ఇంక తామూ, మా మహారాణీ లోక కల్యాణకోసం, వివాహం చేసుకొనితీరాలి. మహారాణి సర్వధర్మ స్వరూపిణి అవడంచేత, ఆమెకర్తవ్యం ఆమె నిర్ణయించుకోవాలి. ఈ లోగా తాము సంకల్పించుకున్న కేదారాది యాత్రలు మానివేయవలసిందని మనవిచేస్తున్నాను.

ఆ మాటలకు చాళుక్య వీరభద్రుడు ఆశ్చర్యమందినాడు. తన మనస్సులోని ఆలోచన ఈ మహానుభావుడు, ఈ శివస్వరూపులు ఎలా గ్రహించగలిగారు? ‘మహాభాగా! గురుదేవా! తమ ఆజ్ఞ నా శిరస్సున కిరీటం కన్న ఎక్కువ గౌరవంగా తాల్చబడుతుంది’ అని చాళుక్య వీరభద్రుడు శివదేవయ్యమంత్రి పాదాభివందన మాచరించి వెడలిపోయినాడు. ఆ సాయంకాలము వీరభద్ర ప్రభువు తిన్నగా కాకతమ్మ దేవాలయానికిపోయి పూజాదికము లైన వెనుక ఆదేవి ఎదుట సమాలింగితభూతలుడై ‘తల్లీ కాకతీదేవి! నువ్వే ఈ రాజ్యాన్ని రక్షించడానికి ఆ సుందరగాత్ర, ఆ వీరచరిత్రగా ఉద్భవించినావు