పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

203

16

“చాళుక్య వీరభద్రుడు శ్రీ కాకతీయ రుద్రమాంబదేవిని ప్రేమించిన మాట వాస్తవము. గాఢంగా పవిత్రంగా ప్రేమించాడు. సీతామహాదేవిని రాముడు ప్రేమించినట్లే ప్రేమించినాడు. కుణాలుడు కాంచనమాలను ప్రేమించినట్లు ప్రేమించినాడు. ఆమె సామ్రాజ్ఞి కాబోతున్నది, చాళుక్య వీరభద్రు డొక సాధారణ సామంతుడు. మహారాజు కొమరితలను సామంతుల కివ్వడం ఆచారం కావచ్చుగాక! రుద్రమదేవి చెల్లెలు గణపాంబాదేవిని సామంత శ్రేష్ఠుడైన కోట భేతమహారాజుకు ఈయలేదా?” ఈ ఆలోచనలతో శివదేవయ్య మంత్రి తన్ను దర్శించడానికి వచ్చిన చాళుక్య వీరభద్రుని కలుసుకొన్నాడు.

“రుద్రమదేవివారి విషయం అంతా వేరు ప్రభూ! ఆమె చక్రవర్తిని అయితీరాలి. ఆమె సాటి మహారాజును వివాహం చేసుకుంటే రెండు రాజ్యాలు ఏకమౌతాయి. ఏ కళింగాధిపతినో, ఏ యాదవ మహారాజునో, ఏ పాండ్యభూపతినో, ఆ రుద్రమహారాణి వివాహం చేసుకుంటే ఆంధ్రరాజ్యం అంతరించిపోతుంది! కాబట్టి ఆమెను అత్యుత్తమ సామంతునకు వివాహం చెయ్యాలికాదా మహారాజా?” అని శివదేవయ్యమంత్రి చాళుక్య వీరభద్రుని మోముచూచి ప్రారంభించారు.

వీర: మహామంత్రి! మీరన్నది నిశ్చయం. అయినా సకల ఆర్యావర్తంలో, దక్షిణాపథంలో ఆంధ్రమహారాజ్యంవంటిది ఇంకొకటిలేదు.

శివ: చిత్తం మహారాజా, ఎవ్వరికీ తెలియనిదినాల్లో ‘రుద్రప్రభువు’ స్త్రీ అని తమ కొక్కరికే తెలిపాను. జ్ఞాపకముందా?

వీర: చిత్తం! అప్పుడు నేను పొందిన ఆశ్చర్యానికి పరిమితిలేదు.

శివ: తాము మొదటినుండి రుద్రదేవి బాలకుడనుకొన్నారు. ఆ దినాలలో తాము తమ హృదయాంతరాల జరిగిన స్పందనమిచేత ఆ బాలకునియందు చాలా అనురాగం, ఆపేక్షా చూపిస్తూవచ్చారు.

వీర: చిత్తం. అప్పట్లో చక్రవర్తి కాబోయే ఆ బాలునియందు నాకు జనించిన భక్తి కాబోలు నను కున్నాను.

శివ: ఆమె బాలిక అని తెలియగానే తమ హృదయం, తాళగతులు తప్పింది మహారాజా! అవునా కాదా? మీరు ఉత్తమచాళుక్యులు. ఈ మహాసామ్రాజ్యము దక్షిణ చోళసామ్రాజ్యంతో కలిపి ఏలిన చక్రవర్తి వంశంవారు, ఆ వేంగి సామ్రాజ్యంలోనే, ఇప్పటికీ మహాంధ్ర చిహ్నంగా రాజ్యంచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించండి. ఈ మహాసామ్రాజ్య చక్రవర్తినితో సరిసమానంగా గద్దె నెక్కగలశక్తి తామొక్కరికే ఉందని, నేనూ గణపతిదేవచక్రవర్తీ ఆలోచించాము. అందుకనే ఆమె బాలిక అని చాలాకాలం క్రిందటనే తమకు తెలియజేసి ఉన్నాము.