పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

గోన గన్నా రెడ్డి

షులు కావడంవల్ల చక్రవర్తి ఆజ్ఞగా ఎంచి ఒప్పుకోకపోవచ్చును. కాని అట్టి అధర్మానికి తా నెట్లు ఒడి పట్టగలదు?

ఈ నిష్టుర రాజధర్మాన్ని తాను నిర్వికారియై నిర్వహించి తీరుతుంది. తాను పురుషుడై పుట్టినచో తండ్రిగారికీ విరుద్ధరాజనీతి అవలంబించవలసిన అవసరం ఉండదుకదా!

రుద్రమదేవి పూజాగృహంలోనికిపోయి కాకతీదేవీ పూజాపీఠానికి ఎదుట సాగిలబడి ‘భవిష్యత్తు తెరలను తొలగించి కర్తవ్యం ఉపదేశించు తల్లీ’ అని ప్రార్థించింది.

11

దుర్గాష్టమి మొదలు అన్నాంబిక ఉపవాసవ్రతం చేస్తూ, కాకతీదేవీ పూజ చేస్తూ ఉన్నది. ఉదయం పూజలు కాగానే ఏవో ఖర్జూర, ద్రాక్ష, అత్తి, మారేడు, జామ, అరటి, నారింజ, నారికేళాది ఫలాలను ఆరగించి, సాయంకాలం పూజ చేసి రాత్రి పాలుమాత్రం త్రాగిఉండేది! ఆలాగు మూడు దినాలు పూజచేసి విజయదశమికి పూజ పూర్తిచేసింది.

విజయదశమి వెళ్ళిన మరునాటికి కోట పేర్మిడిరాయుడు తెఱాల కాటయ, గుంటూరి నాగవిభుడు కలిసి భేతమహారాజులను హతమార్చడానికి సైన్యాలతో ధాన్యకటకం చేరుతున్నాడని శివదేవయ్య దేశికులకడకు వేగు వచ్చింది.

ద్వాదశినాడు పేర్మాడిరాయుడు భేతమహారాజులను, వారి రాణివాసాన్ని వారి నగరిలోనే బంధించి, ధాన్యకటకనగరం ఆక్రమించాడనీ, ఏదో వంకను భేతమహారాజును కైలాసవాసిని చేయ ఆలోచిస్తున్నాడనీ, గుంటూరి నాగవిభుడు సర్వసైన్య ఆయత్తంచేసి, ధాన్యకటకంమీదకు వెళ్ళబోతున్నాడనీ, వా రిరువురు, తెఱాల కాటయ్య కలసి ఓరుగల్లు ముట్టడించడానికి సిద్ధమౌతారనీ వేగు వచ్చింది.

శివదేవయ్యమంత్రి రుద్రమహారాజు దర్శనంచేసి మహారాజుతో మంతనంసలిపినారు. ఇంతలో ప్రసాదాదిత్య ప్రభువును, సబ్బిసాహిరమండల సకల సేనాపతిపట్టసాహిణి పడికము బాప్పదేవప్రభువునకును, జాయపమహారాజునకును వార్త పంపినారు.

వారందరిసభలో రుద్రప్రభువు ‘నేను సకలసేనాపతిగా పడికము బాప్పదేవ ప్రభువు సేనాపతిగా గుంటూరుమీదకు దండయాత్ర చేస్తాను. జాయపమహారాజు ప్రసాదాదిత్య ప్రభుసహాయంగా ఓరుగల్లునగరం కాపాడడం, మధ్యరాజ్యాలన్నీ చూస్తూఉండడం చేయవలసింది! జన్నిగదేవుని, వారికుమారులు త్రిపురాంతక అంబయ్య దేవులను కొంచెం జాగ్రత్తగా ఉండవలయునని తెలియచేయాలి! నేను గురుదేవులు ఏర్పరచిన శుభముహూర్తానికి జైత్రయాత్రకు వెడతాను. నాతో