పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

191

నా సవితితల్లి శ్రీ నారాంబా మహారాణీగారు దయచేయగలవారు’ అని చెప్పినారు.

శివదేవయ్యమంత్రి చాలా బాగున్నదని సమ్మతించినారు.

అన్నాంబిక రుద్రప్రభువును త్రయోదశినాడు దర్శించినది. ‘మహాప్రభూ! తామే స్వయంగా జైత్రయాత్రకు వేంచేస్తున్నారని నగరమంతా వాదు ప్రసరించింది’ అన్నది.

రుద్ర: చెల్లీ! ఎన్నిసారులు నన్ను ప్రభూ గిభూ అని పిలువవద్దన్నాను? అయినా నువ్వల్లాగేపిలుస్తున్నావు!

అన్నా: క్షమించండి అక్కా! ఈసమయంలో మాకు సర్వసేనాపతులు, మహారాజులు మీరు. ఆ భావంతో అన్నాను. నేను మనవిచేసేది ఏమిటంటే, మిమ్మువదలి ఇక్కడ ఉండలేను. నేనూ వీరవేషంతో మీకు అంగరక్షకురాలుగా ఉంటాను.

రుద్ర: తల్లీ! నీకు ఏమైనా మొప్పం రావచ్చును.

అన్నా: మీకు రాదుకాబోలు! నన్ను ఇంటిదగ్గర సౌఖ్యంగా కూరుచుండమంటారా? ఏమి పక్షపాతమండీ అక్కా?

రుద్ర: అలాగే చెల్లీ! నువ్వు ప్రయాణసన్నాహంలో ఉండు. నీ అక్కకు అంగరక్షకురాలివిగా ఉండు. ఈమగవాళ్ళకు స్త్రీలు ఎలాయుద్ధం చేయగలరో చూపిద్దాము.

అన్నా: అక్కా! మీరు ఒప్పుకుంటే మనరాజ్యంలో వీరస్త్రీదళం ఒకటి సిద్ధంచేసి, ‘ఆంధ్ర వీరరమణులు శ్రీశ్రీరుద్రమహాదేవ పరిపాలనంలో ఉన్నారు’ అని లోకానికి చాటిస్తాను.

రుద్ర: నీ అభిప్రాయం అద్భుతం. కైకేయి, సత్యభామా మహాయుద్ధాలు చేశారు. దన్యులను వేదకాల స్త్రీలు చెండాడేవారు. మనమూ తక్కువకాదు. ఇప్పుడు నేను స్వయంగా జైత్రయాత్రకు బయలుదేరడంలో పరమోద్దేశం ఒకటి ఉన్నది. అది గురుదేవులూ గ్రహించారు. నేను ఈ మహారాజ్యాలన్నీ పరిపాలించక తప్పదు. నేను నీరసురాలనని తెలిస్తే, ప్రతిసంవత్సరమూ ఈలాగే ఎవరో మాండలీకులు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. దేశంలో అధర్మంనిండి, విచ్ఛిన్న శక్తి తాండవం చేస్తుంది. ఒక్కసారి నేను యుద్ధయాత్రచేసి దక్షిణం అంతా సంచారంచేసి దుర్మార్గులైన మాండలీకులను శిక్షించి, తక్కినవారి హృదయంలో ‘జాగ్రత్త’ అని ప్రతిధ్వనింప చేస్తాను.

అన్నా: ఇంకో రహస్యంకూడా ఉంది. మీరు స్వయంగా ఏ మహాయుద్ధంలోనూ పాల్గొని ఉండలేదు. ఇప్పుడా అవకాశం లభించింది. అదీ గాక మీరు స్వయంగా వెళ్ళితే, రాజద్రోహు అనేకుల హృదయంలో రాజ భక్తి తిరిగి ప్రవేశించవచ్చును.