పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

189

దేశికులిట్లు పలుకునపుడు తండ్రిగారి సర్వప్రజ్ఞలూ వారి కళ్ళలో పుంజీభవించి తన దెస ప్రసరించినాయి. ఆ కళ్ళలో తనపై అత్యంత విశ్వాసము వెల్లివిరిసింది. ఆ కళ్ళలో ప్రార్థన కాంతించినది. ఆ కళ్ళలో దివ్యప్రేమ నర్తించింది. ఆ కళ్ళలో ఒక మహాగర్వము ప్రవహించింది.

వెంటనే రుద్రమదేవి ‘నాన్నగారూ! నేను నా పితృపాదులకూ, నా చక్రవర్తికీ, సర్వదేవతల సాక్షిగా నేను తండ్రిగారికి వారసురాలుగా చక్రవర్తిని అవుతాననీ, నేను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాడనీ, నా కుమారుడు కానీ, నేను దత్తుచేసుకొన్న బాలుడు కానీ కాకతీయ వంశజుడు అవుతాడనీ, నేనూ కాకతీయవంశగానే ఉంటాననీ మాటఇస్తున్నాను. ఇది నేను ఆడితప్పితే ఏడేడు కాలాలు నరకంలో ఉండగలదాన్ని, కాశీలో గోవును చంపినదాన్ని, గురుహత్య చేసినదాన్ని, బ్రాహ్మణధనం దోచినదాన్ని’ అని ఆమె గంభీరంగా పలికింది.

ఆ మాటలు విన్న గణపతిదేవ చక్రవర్తి సంతోషం నిండిన మోముతో కుమార్తెకు వీడ్కోలొసంగెను, రుద్రదేవి ఏవేవో ఆలోచనల పాలయి నెమ్మదిగా తన నగరు చేరింది.

తనకు సామ్రాజ్యం వదలి, సాధారణగృహిణిగా, ఆనందజీవితం అనుభవించాలన్న కాంక్ష కలగడం తండ్రిగారు గ్రహించారో లేదో! శివదేవయ్య దేశికులు మాత్రం గ్రహించారు. తనకు వివాహం అయితే కాకతీయవంశంలో తా నెట్లా ఉండగలదు? అందుకనే తండ్రిగారా వాగ్దానం అడిగారు. వివాహం నిజం. కాని తనభర్త సామ్రాట్టు కాకూడదు. అలా సామ్రాట్టు అయితే అనేక కలహాలు, అపశ్రుతులు సంభవింపవచ్చు. కాని తనభర్త చక్రవర్తి కాకుండా ఉండుట ఎలా? అది ధర్మమా? నీతియా?

ధర్మశాస్త్రప్రకారం స్త్రీ వివాహంకాకుండా ఎలా ఉండుట? సన్యాసిని కావాలి. తాను వివాహం చేసుకుంటే తనభర్త చక్రవర్తి కాకూడదు! రాజనీతి ననుసరించి, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల మహాసామ్రాజ్య సింహాసనం అధివసించిన స్త్రీ వివాహిత కాకున్నా తప్పేమీ ఉండదు. అందుకే తండ్రిగారు వివాహం చేసుకొని తీరుతాననే వాగ్దానం కోరలేదు. అంతవరకుశుభం! తాను ఆ దివ్యపురుషునే ప్రేమించి వారికి తన హృదయంలో పట్టము కట్టుకొన్నమాట నిశ్చయం. అట్టి ఆ పురుషోత్తముని తాను వివాహం చేసుకొంటే వారికి అర్ధసింహాసనమిచ్చి చక్రవర్తిగా చేయకుండుటెట్లు?

ఇంతకూ ఆ వీరోత్తముడు తన్నెట్లు ప్రేమించగలడు? తాను స్త్రీ నని ఈ రెండేండ్లు వా రెరిగిఉన్నమాట నిశ్చయమే. ఆనాడు తోటలో నిజ స్వరూపము చూచినారు. ఆ చూచినది నన్నేనని వా రెరుగరు. తన్ను వివాహ మాడుడని వారిని కోరితే, తాను చక్రవర్తులు కాకూడదని వారికి నివేదిస్తే....వారు పరమోత్తమ పురు