పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

171

దుర్గాష్టమినాడు ప్రతికుటుంబము కాకతమ్మను ఊరేగిస్తూ ఊరిమధ్య ఉన్న దేవాలయందగ్గర చేరి నాట్యా లాడుతూ, పాడుతూ బాలికలు, ప్రౌఢాంగనలు అందరూ బాజాభజంత్రీలతో అమ్మవారిని నీటకలిపేచోటికి పోయి, పాటలు పాడుతూ నాట్యాలుసల్పి చివరకు బ్రతుకుదేవత కాకతమ్మను నీటిపాలుచేస్తారు. తెచ్చిన ప్రసాదాలను అందరికీ పంచుతారు.

ప్రోలేశ్వరంలోనూ కాకతమ్మ ఉత్సవం దుర్గాష్టమినాడు అఖండంగా సాగినది. ఊరిలోని బాలికలు, ప్రౌఢలు, జరఠలు చేరి కోలాహలముగా కాకతమ్మ ఉత్సవం చేస్తూఉండిరి.

ప్రోలేశ్వరంలో ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు దశగ్రామాధికారి ఉన్నాడు. ఆయన కాశ్యపగోత్రీకుడైన మాచయమంత్రి చెన్నాప్రగడ వంశీకుడు. మాచయ మంత్రి చదువుకున్నవాడు, ఉత్తమకవి, శాంతచిత్తుడు. ప్రోలేశ్వరగ్రామములో ఉండి దశగ్రామ సంఘాధ్యక్షుడై చల్లని కాకతీయ ధవళచ్ఛత్రం క్రింద రామరాజ్యం నెలకొల్పినాడు.

గ్రామభూమి గ్రామ ప్రజలది. ప్రజలందరూ భూమైనా పంచుకునేవారు; లేకపోతే పంటయినా సమంగా పంచుకునేవారు. రాజు కీయవలసిన ఆరవవంతు గ్రామం పంటలోనే కేటాయించి, తక్కినపంట సమంగా పంచుకునేవారు. తిండికి కావలసిన పంట ఉంచుకొని, తక్కినపంట ఎగుమతికి పంపించేవారు.

ప్రతిగ్రామానికి గ్రామకంఠం - రాజభూమి ఉండేది. రాజభూమి గ్రామ ప్రజ లుపయోగించుకొని తమపాలు పోగా తక్కినది ప్రభువునకు పంపేవారు. కొన్ని గ్రామాలకు సామంతప్రభువు ఒకడు ఉండేవాడు. ఆ ప్రభువు తన మహా మండలేశ్వరులకు, ఆయన చక్రవర్తికి కప్పం పంపించేవారు. సైన్యాలకు ప్రజలు సహాయాలు చేయవలసి ఉండేది.

కాకతీయ గణపతిరుద్రుడు సింహాచలమునుంచి కంచివరకు, తూర్పుతీరము నుండి కుంతలదేశంవరకు రాజ్యం అంతా జయించి తనకు నమ్మకమున్న మండలేశ్వరుల, మహామండలేశ్వరుల ఆ యా నాడులకు, విషయాలకు అధిపతుల చేసినాడు.

మాచయామాత్యునకు దేశపరిపాలన, రాజనీతి అన్నీ క్షుణ్ణంగా తెలుసును. వైద్యవిషయంలో అందెవేసిన చెయ్యి. చెన్నాప్రగడవారు, చాళుక్య మంత్రి హరితసగోత్రీకుడైన చెన్నయ్యమంత్రి కాలంనుండీ ఉత్తములైనవైద్యులు. ఆ మహోత్తమవిద్య చెన్నాప్రగడవారి కులవిద్య అయినది.

మాచయమంత్రికి ముగ్గురు కొమరితలు, ఇరువురు కుమారులు. కాకతమ్మ ఉత్సవానికి మంత్రిగారి భవనంనుండి ముగ్గురు బాలికలు కాకతమ్మను పట్టుకొని,