పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

గోన గన్నా రెడ్డి

మేళతాళాదులు ముందునడువ గణికలు నాట్యంచేస్తూ ఉండగా ప్రోలేశ్వరస్వామి గుడికి వెళ్ళినారు.

ఊరిలోని రాచవారైన రెడ్లు, బ్రాహ్మణులు, వర్తకులు, వ్యవసాయదారులు అయిన ఆంధ్రవైశ్యులు, ఆంధ్ర శిల్పబ్రాహ్మణులు, కుమ్మరివారు, మంగలివారు, గొల్లలు, చాకలివారు, కురవలు, బోయీలు, ఉప్పరులు ఆ ఉత్సవానికి దేవాలయంకడ చేరినారు.

బాలికలందరూ తీయని కంఠస్వరాల పాటలు పాడుచు, నాట్యంచేస్తూ ఉండిరి. వేళాకోళాలు, కేకలు, నవ్వులు ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించి పోయినాయి. ఆ వెనుక మేళతాళాలతో కాకతమ్మ బొమ్మలను కొనిపోయినారు. ప్రోలేశ్వరము గ్రామం బైటవున్న ప్రోలసముద్ర మను బ్రహ్మాండమైన చెరువులో కాకతమ్మను ఓలలాడించారు.

అటువెనుక ఊరివారూ, బాలికలూ తమ తమ ఇళ్ళకు వస్తూఉండగా, మాచయమంత్రి పెద్దబాలిక పదునారేండ్ల ఈడుగల జవ్వనిఎదురుగా ఒక యువకుడు రావడం గమనించింది. ఆ బాలిక తలవంచేసింది. చిరునవ్వులు పెదవులపై, కన్నులపై, బుగ్గలపై తాండవించిపోయినాయి.

పక్కనునడిచే అక్క అడుగు తడబడడం, అక్క ఏదో అయిపోవడం పెద్దచెల్లెలు గమనించింది. పదమూడేండ్ల ఆ బాలిక అక్క మొగంవైపు చూచి, ఇటు నటు తలత్రిప్పి చూచింది. ఎదురుగా తమ్ముచూచి నవ్వుతూ అక్కినప్రగడ నడిచివస్తూవున్నాడు. కవచం ధరించి కరవాలం నడుముకు వ్రేలాడుతూ ఉండగా చేత శిరస్త్రాణం ధరించివచ్చే అక్కినప్రగడను సీతమ్మ కొంతసేపు ఆనవాలు పట్టలేకపోయింది. ఆనవాలు పట్టిన పిమ్మట నాలుగేండ్ల ఈడుగల తన చెల్లెలు, కల్యాణిని చూచి, చెల్లాయీ! బావే! అక్కినబావే! దొంగబావ! ఎక్కడనుంచి వచ్చాడు?’ అని కేక వేసి, అక్కగారివంక చూచింది. అక్కగారు తన చేయి గట్టిగాపట్టుకొని ‘అందరూ వింటారు నెమ్మది’ అని గుసగుసలాడింది. తల మాత్రం ఎత్తలేదు. సీతమ్మ మాటలకు ప్రక్కనున్న ఆడవారూ, బాలికలూ అక్కినప్రగడవైపుకు చూపులు మరల్చారు.

ఆడవారందరూ తన్ను తేరిపార చూడడం గమనించి, మోమునందు సిగ్గు ఉదయింప అక్కిన వెనుకకు తిరిగి విసవిస నడిచి వెళ్ళిపోయాడు, కామేశ్వరి తనకు కానున్న భర్తగారు అలా వెళ్ళిపోవడం తలవంచే వాలు చూపులు పరపి గమనించింది. ఈమె విషయం ఆమెతోపాటు నడిచే కొందరు బాలికలు గమనించారు. ఓహో! అమ్మవారిని పూజచేసిన ఫలం ఇప్పుడే కనబడుతోందమ్మా!’ అని ఒక బాలిక అన్నది. ఒక పుణ్యస్త్రీ అలా వస్తుంది కాబోలు