పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

గోన గన్నా రెడ్డి

వెన్నెలకూ స్వప్నాలకూ దగ్గరి సంబంధం. వెన్నెలలో స్వప్నాలు అమృత తుషారంలా, ముత్యాల రజనులా సుడులు తిరుగుతుంటాయి. ఆ స్వప్నాలు వెన్నెలలో తడిసి మత్తిల్లి, గాఢపరీమళపూరితాలయి, మధురరసోపేతాలయి హృదయము, మనస్సు, జీవితమూ నిండిపోతాయి. ఆ వెన్నెల అతిసున్నితంగా యోషల జీవితంలో ప్రసరిస్తుంది. సౌందర్యవంతుల సౌందర్యము ఆ వెన్నెలలో మరింత సుందరమై లోకాల నావరిస్తుంది.

రుద్రాంబిక అన్నాంబికలు ఒక్కసారిగా తమ తమ కలలలోనుండి ఉలిక్కిపడి మెలకువపొంది పక పక నవ్వారు.

“అక్కా ఏమిటమ్మా! మీరు కలలు కంటున్నారు?”

“చెల్లీ! ఏమిటే నువ్వు స్వప్నాలలో మునిగిపోయినావు?”

5

ఒక్క ఓరుగల్లులోనే కాకుండా సబ్బిసాహిరవిషయమూ, పానుగంటి విషయం, పిల్లలమఱ్ఱి విషయం, మానువనాడు మొదలయిన అనేక దేశాలలో కాకతమ్మ ఉత్సవం ఎంతో ఆనందంతో ప్రజలు జరుపుతూ ఉండేవారు. ప్రజలకు కాకతమ్మ అయినా ఒకటే ముమ్మడమ్మ, మారెమ్మ, మాంచాలమ్మ ఎవరయినా ఒకటే. అమ్మవారికి దసరాలలో ఉత్సవం జరపడం భరతదేశాచారము.

బీదలు, సాదలు సాధారణ మనుష్యులు హీనదేవతలనూ, నాగరికజనులు శక్తిని, ఉమను, కాళిని, పార్వతిని, లలితను, రాజరాజేశ్వరిని పూజించేవారు. వామాచారులు మధుమాంసాదులు అమ్మవారికి అర్పించి తాము సేవించేవారు. దక్షిణాచారులు దానిమ్మపళ్ళు, జపాకుసుమాలు, పంచామృతాలు అర్పించేవారు.

యుగయుగాలనుండీ శాక్తేయమున్నది. ఉషోదేవ్యర్చన, మాతృపూజ, సావిత్య్రర్చన, సురపూజ, దేవ్యర్చన వేదకాలంలోనే ఉండేవి. ఉపనిషత్కాలంలోనూ పరదేవతార్చన కద్దు. పురాణయుగంలో దేవీపూజ ఉచ్చస్థితికి పోయింది. బౌద్ధయుగంలో తార, పారమితషట్కార్చన, జైనులు భగవతీ విద్యార్చనలు చేసినారు ఈనాటికీ తెలంగాణపు పల్లెటూళ్ళలో కాకతమ్మ పూజ బ్రతకమ్మ ఉత్సవంగా వెల్లివిరిసింది.

పిల్లలమఱ్ఱికి యోజనదూరంలో నున్న ప్రోలేశ్వరమనే గ్రామంలోను ఆబాలగోపాలమూ కాకతమ్మ ఉత్సవం చేస్తున్నారు. ఊరిమధ్య మఱ్ఱిచెట్టు క్రింద పల్లెలో పూలతో కాకతమ్మ విగ్రహమునుచేసి, తంగేటిపూలు, గొనుగు పూలు, గొబ్బిపూలు, ఇతర అడవిపూలు అమ్మవారిచుట్టూ పేరుస్తూ ఉంటారు. ఏదినాని కాదినము బాలికలందరూ ‘కాకతమ్మ నువ్వు బ్రతుకు దేవతవు, ఉయ్యాల జంపాల ఉయ్యాల!’ అంటూ పాటలు పాడుతూ, ఏదినాని కాదినం కాకతమ్మను ఊరబావిలోనో, చెరువులోనో, వాగులోనో కలుపుతూ ఉంటారు.