పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

149

వెంటనే అశ్వికుల్ని ప్రసాదాదిత్యుని దళపతులు బందీలను చేశారు. ప్రసాదాదిత్యులు గౌరవంతో రుద్రయామాత్యునికి స్వాగతంఇచ్చి శ్రీ లకుమయారెడ్ది ప్రభువును ఆ భద్రగజంమీదనే పిల్లలమఱ్ఱి తీసుకొనిపోయి, అచ్చట కోటలో రాజభవనంలో దింపి తూలికాతల్పంమీద పరుండబెట్టినారు. రేచెర్లవారి రాజవైద్యుడు వచ్చి లకుమయారెడ్డి నాడిచూచి ప్రభువు జ్ఞానపత్రి, నల్లమందు తినియుండుటచే వారి కా మత్తు కలిగినదనిన్నీ, మత్తువదిలే సూచనలు కనబడుతున్నవనీ చెప్పాడు.

ఆ వుదయం పదునొకండు గడియలకు లకుమయప్రభువు కండ్లు తెరిచాడు. ఆయన కండ్లుతెరిచిన కొద్దికాలంవరకూ తా నెక్కడున్నదీ తెలియక ఏవేవో అసందర్భవాక్యాలు పలుకుతూ వుండెను. దాసీ లాయన నుదురు చల్లని సుగంధ జలముతో తడుపుచుండిరి. ఒకగడియ అయినవెనుక లకుమయ మహారాజుకు సంపూర్ణంగా తెలివి వచ్చింది. ‘ఇప్పుడు నే నెక్కడున్నాను?’ అని చటుక్కున లేచి ప్రశ్నించాడు.

“మహారాజా, మీ రిప్పుడు పిల్లలమఱ్ఱిలో రాచనగరులో అతిథిమందిరంలో వున్నారు” అని రుద్రయామాత్యుడు మనవిచేశాడు.

లకు: రుద్రయామాత్యులవారూ! మీ రేల వచ్చినారు? ఆ రాక్షసుడు మిమ్ము బందీగా కొనిపోయాడని మీ భటులు ఎంతకాలంక్రిందటో మాకు చెప్పారు. అప్పటినుండి మీరు కనపడలేదుకూడా!

రుద్ర: మహాప్రభూ! మీకు వచ్చినవార్త నిజమైనదే. నన్ను గన్నారెడ్డి ప్రభువు...

లకు: ఆ పరమనీచుని పేరు నా ఎదుట తీసుకురాకండి.

రుద్ర: చిత్తం మహాప్రభూ! ఆ గజదొంగ నన్ను పట్టుకొని శ్రీశ్రీ యువ మహారాజులవారిని గంతలుకట్టి తీసుకొని వెళ్ళిన స్థలానికే నన్నూ తీసుకువెళ్ళాడు. నాకూ గంతలుకట్టారు.

లకు: ఏమిటీ! వీడి దౌర్జన్యానికి అంతులేకుండా ఉంది. ఇంతకూ శ్రీశైలంలో ఉన్న మేము ఇక్కడి కెలా వచ్చాము?

రుద్ర: చిత్తం మహాప్రభూ! అదే మనవిచేస్తున్నాను. వారు నన్ను గౌరవంగానే చూస్తూ ఒక ఇంటిలో ఆ రహస్యనగరంలో ఉంచారు. నిన్న సాయంకాలం నా కళ్ళకు గంతలుకట్టి వారు ఒక గుఱ్ఱంమీద ఎక్కించి ఎక్క డెక్కడో తిప్పి ఒకప్రదేశంలోదింపి కళ్ళకు గంతలువిప్పారు. ఎదురుగుండా మహాప్రభువుల భద్రగజమూ, బంగారపు అంబారీ ఉన్నవి. నన్నుకూడా అంబారీ ఎక్కించారు. లోన ప్రభువులు నిద్రపోతున్నారనీ, నేను జాగ్రత్తగా ఉండాలనీ ఎవరో నాతో చెప్పారు. మాచుట్టూ వేయిమంది అశ్వికులుకూడా వస్తూ ఉండగా ప్రభువులను వాళ్ళు ఈ పురం చేర్చి ప్రసాదాదిత్యనాయకులవారికి తమ్ము అప్పగించారు.