పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

గోన గన్నా రెడ్డి

బంగారుపాత్రలు దొరికినవి. అనేక విధాలుగా ఎక్క డెక్కడినుంచో ధనం వస్తూ ఉన్నది. ఆ రహస్య పర్వతప్రదేశంలో ఒక విచిత్రరాజ్యం ఉద్భవించింది.

గన్నారెడ్డి వేలకొలది జాతిగుఱ్ఱాలను బంగారు రాసులు పోసి సముపార్జించినాడు. గుఱ్ఱాలమీద అతివేగంగా స్వారీచేస్తూ ఉరకడం, అతివేగంగా పరుగిడే గుఱ్ఱంమీదకు ఉరకడం, పగ్గములులేక గుఱ్ఱముల స్వారిచేయుట, గుఱ్ఱములపై పండుకొని స్వారిచేయుట, అతివేగంగా గుఱ్ఱముపై స్వారిచేస్తూ బాణముల గురి చూచి కొట్టుట మొదలయిన పనులన్నీ వేలకొలది అశ్వికులకు నేర్పించినాడు. దుష్టతురగరేఖావంతుడై అతడు అతిరథశ్రేష్ఠుడై వెలిగిపోయాడు.

అక్కడినుండి అప్రతిమాన వ్యూహరచనాసామార్థ్యంతో, యుద్ధనైపుణ్యంతో దేశా లన్నిటిలో రాజు లందరికీ గుండెబెదు రయినాడు. ఇరువదివేలమంది అశ్వికులు, వాయువుతో పందెములు వేయువారు ఆ లోయలో శిక్షణ పొందినారు. నదులు ఈదుట, కొండ లెక్కుట, ఎంతనున్నటి గోడలనైనా ఎగబ్రాకుట, తాటి నిచ్చెనలు సిద్ధముచేయుట, వివిధాయుధ యుద్ధముచేయుట, అనేక నూత్న యుద్ధములు సృష్టించుట, జట్టులు దళములు పంక్తులు బారులు వ్యూహాలు చెడకుండా అతివేగాన పరుగులిడి శత్రువులను గదియుట, బాణములు పరుగులో గురితప్పకుండావేయుట, పండుకొని, కూర్చుండి, మోకరించి, బాణాలు గురిచెడకుండవేయుట, శూలయుద్ధము, శూలములు దూరాన గురితప్పకుండా విసిరివేయుట, మల్లయుద్ధము చేయుట, అన్నివిధములైన కత్తియుద్ధములుచేయుట, గజములతో, వ్యాఘ్రములతో యుద్ధము చేయుట గన్నారెడ్డి సైనికు లందరూ నేర్చుకొన్నారు.

6

గన్నారెడ్డి పినతండ్రి లకుమయ్యను బందీచేసినా అత్యంత గౌరవంతో ఓరుగల్లుపురం చేర్చినాడు. ఒక వార్తాహరునిచే శివదేవయ్యమంత్రికి ‘లకుమయారెడ్డిని, ఆయనమంత్రి రుద్రయామాత్యులను బందీలుగా సార్వభౌముల సేనాపతుల కెవరికైనా పిల్లలమఱ్ఱికడ అప్పగింతుమనీ, వారిని అత్యంత గౌరవంగా గోనవారి నగరులో ఉంచవచ్చుననీ, విధేయుడు గజదొంగ’ అని ఉత్తరం పంపించాడు.

వెంటనే ప్రసాదాదిత్యనాయకులు దళపతులతో పదివేల గుఱ్ఱపుసైన్యం తీసుకొని రెండురోజులలో పిల్లలమఱ్ఱి చేరినాడు. మరునా డుదయం ఒక భద్ర దంతావళముపై బంగారు చవుడోలుపై పట్టుపరుపులపై పరుండి నిద్రపోవు లకుమయారెడ్డి మహారాజును, రుద్రయామాత్యులను నలుగురు అశ్వికులు ప్రసాదాదిత్యనాయని సైన్యంకడకు తీసుకువచ్చారు.