పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

గోన గన్నా రెడ్డి

లకు: ఏమిటీ ప్రసాదాదిత్యనాయకులకా? ఆయన ఈ ఊరు ఏల వచ్చాడు? అశ్వికులు ఆయన సైనికులా? అప్పగించడ మేమిటి?

రుద్ర: మహాప్రభూ! ఆ వేయిమందిలో నలుగురుతక్క తక్కినవారందరూ ఈ నగరం అయిదు గవ్యూతు లుందనగనే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఆ నలుగురూ తీసుకొనివచ్చి, ఈ నగరానికి ఏకారణంచేతనో వచ్చిన ప్రసాదాదిత్య నాయకునకు అప్పగించినారు. వారు మిమ్మల్ని ఈ రాచనగరిలో ప్రవేశపెట్టారు.

లకు: ఎంతపని జరిగిందీ! మాకు శ్రీశైలం ఎవరో ప్రసాదం పంపారు. మేము దానిని తిన్నాము. ఎదో నిద్రమత్తు విపరీతంగా వచ్చింది. పోయి పడుకొంటిమి, తరువాత ఇదే మెలకువరావడం.

లకుమయారెడ్డి తాను లక్ష సైన్యంతో గన్నారెడ్డిని పట్టడానికి రావడం, గన్నారెడ్డి కందూరి కేశినాయని చంపివేయడం మొదలయినవన్నీ రుద్రయామాత్యునితో పూర్తిగాచెప్పి, ‘మన మిరువురము వెంటనే వర్థమానపురం చేరాలి. శ్రీశైలం దగ్గర సైన్యాలవిషయం ఏమయిందో తెలియలే’ దన్నారు.

రుద్రయామాత్యులు గన్నయ్య వందిభూపాలుని, ఉప్పల సోముని నాశనం చేయడం, ఆదవోని ప్రభువు కొమార్తె నెత్తుకుపోయి తన అక్కగారికడ వుంచడం మొదలయిన విషయాలన్నీ తన ప్రభువు చెప్పగా విన్నారు. ఏది ఎటులవునో అని గజగజ వణికిపోయినాడు.

లకుమయారెడ్డి స్నానాదికములన్నీ అయి, రేచెర్ల ప్రభువు పంపిన నూతన వస్త్రాదికములు ధరించి, తన విడిదిలో సుఖాసీనుడై ఉండగానే ప్రసాదాదిత్యనాయుడు తాను లకుమయతో మాట్లాడవలసియున్నదని సందేశ మంపినాడు. లకుమయారెడ్డి ‘అంతకన్న ఆనందమేమి ఉన్న’ దని మరల సందేశమంపినాడు. వెంటనే ప్రసాదాదిత్యప్రభువు లకుమయకడకు వచ్చినాడు. లకుమయ సగౌరవంగా ఆతని నెదుర్కొని తీసుకువచ్చి పీఠాన్ని అధివసింపచేశాడు. ప్రసాదాదిత్యనాయుడు లకుమయప్రభువును చూచి ‘మహాప్రభూ! నేను రాజప్రతినిధి అయిన రుద్రదేవుల ఆజ్ఞచేత, గజదొంగ గన్నారెడ్డిని పట్టుకొనడానికి ఈ ప్రాంతాలకు వచ్చాను. అప్పుడు గజదొంగజట్టులోని నలుగు రాశ్వికులు మిమ్ము తీసుకొనివచ్చి నా కప్పగించినారు. నేను వెంటనే వారిని బంధించితిని. కాని వారు ఎటుల చిత్రముగా తప్పించుకొనిపోయిరో తెలియలేదు. నూరుగు రాశ్వికులు వారిని వెదకుచున్నారు. ప్రభువులకు వేయిసైన్యం రక్షణ కిస్తున్నాను. తమరు ఓరుగల్లు వెళ్ళవలసిన ముఖ్య కారణ మొకటి వచ్చింది. ఓరుగల్లు వెళ్ళి ప్రభువులు తమనగరు చేరుకోవచ్చును. పిల్లలమఱ్ఱి పాలకుల సహాయంతో నేను గన్నారెడ్డిని పట్టుకొనడానికి వెళ్ళుతున్నాను’ అని మనవిచేసి వెళ్ళిపోయినాడు.