పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

147

దాము. ఈ లోగా వారు వారు తగిన ధనం, బలగం పోగుచేసికొని సిద్ధంగా ఉండండి” అని గన్నారెడ్డి తెలిపెను.

వీర యువకలోక మంతా ‘వల్లె’ యని కత్తులు పై కెత్తెను. ఆ జట్టుకు నాయకుడు గోన గన్నయ్య. అతని నాయకత్వం అంటే ఎవ్వరికీ ఏవిధమైన అనుమానాలూ లేవు.

ఈ సమావేశం జరిగిన నెలదినాలకు ‘సర్వం సిద్ధమైనది. కాబట్టి ఇక రావచ్చు’ అని విఠలయ్యదగ్గరనుంచి వార్త వచ్చింది. ఒకదినాన వారందరూ కలుసుకొని శుభముహూర్తం ఏర్పరచుకొన్నారు. మైలారదేవుని సాక్షిగా, వీరభద్రుని సాక్షిగా, ఏకవీర సాక్షిగా, స్వయంభూదేవ సాక్షిగా వారు ఒట్లు పెట్టుకొన్నారు. ఏర్పరచుకొన్న శుభముహూర్తాన వారందరూ ఓరుగల్లు విడిచి పోయారు. వారు ఓరుగల్లు వదలిన వారము దినాలకు గన్నా రెడ్డికడనుండి శివదేవయ్య మంత్రికి ఉత్తరం వచ్చింది.

“శ్రీ శ్రీ శ్రీ అపరగురుమల్లికార్జునావతార, శివదేవయ్య పండితారాధ్య దేశికులకు పాదపద్మాల సాగిలంబడి గోన గన్నయ్య మనవి.

“మా పినతండ్రి నా రాజ్యం తన హస్తగతం చేసుకొన్నాడు. ఈలాంటి అన్యాయాలు శ్రీశ్రీశ్రీ సప్తమ చక్రవర్తులైన మా సార్వభౌములు వృద్ధులవడం వల్ల సంభవించినవి. మా కీ రాజ్యంలో న్యాయం దృశ్యం కావటంలేదు. కాబట్టి మే మంతా దోపిడి దొంగల మవుతున్నాము. నాతోపాటు ఇరవై అయిదుగురు రాజకుమారులు వచ్చారు. శ్రీ చిన అక్కినప్రగడ మహామంత్రీ వచ్చినాడు. మేము మా రాజ్యం స్థాపించుకొన్నాము. మేము ఎవరు ఎంత ప్రయత్నించినా దొరకము. ఆ యా రాజకుమారులు వారి వారి తల్లిదండ్రులకు ఉత్తరాలు వ్రాసుకొన్నారు. మమ్మల్ని పట్టుకొనవచ్చినవారిని హతమారుస్తాము. అన్యాయము చేసే వారిని దోస్తాము. మాకు స్వయంభూదేవుడే నాయకుడు. ఇట్లు తమ శిష్యపరమాణువు గోన గన్నయ్య. ఇవే అనేక శుభలేఖార్థములు.”

ఆ ఉత్తరం చూచి శివదేవయ్య చిరునవ్వు నవ్వుకొన్నాడు. ఆ సాయంకాలంలోగా వివిధ రాజనగరులనుండి ప్రభువులు, పెద అక్కిన మంత్రులవారు హుటాహుటి ముఖ్యమంత్రి శివదేవయ్యకడకు వచ్చారు.

“మీ మీ కుమారులకు భయ మేమీలేదు. నేను వారినందరినీ మంచి మార్గానికి దింపే సాధనం ఆలోచించి తిరిగి రప్పిస్తాను. మీ మీరేమీ తొందర పడకండి” అని శివదేవయ్య దేశికులు బోధించారు.

ఆ నాటినుండి ఊళ్ళు దోచకపోయినా, ఇతరులను దోచకపోయినా గన్నారెడ్డినిగూర్చి ప్రపంచమంతా గగ్గోలుపుట్టింది. ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు గన్నారెడ్డి పెద్దసైన్యము సమకూర్చినాడు. కోట్లకొలది టంకాల వెల గలిగిన