పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

గోన గన్నా రెడ్డి

ఎప్పుడూ చదువుట మానలేదు. అన్నగారికి చదువు గరుత్మంతునికి ఎగురుట వచ్చినట్లు రావడం, తనకు చదువుదూరదూరాననే ఉండటం అతనికి నవ్వువచ్చేది. అన్నగారే అతనికి ముఖ్యగురువై పాఠాలు నేర్పేవాడు.

అన్నగారు విఠలయ్యకు భగవంతుడు. అతనికి మల్లయుద్ధం అంటే అపరిమితప్రేమ. అన్నగారిని ఎవరైనా నిరసించినట్లు కనబడితే వెంటనే ఆ యువకు డెంత పెద్దవాడైనా, పూలచెండులా పై కెత్తి ‘జాగ్రత్త’ అని మళ్ళీ క్రిందకు దింపేవాడు.

గన్నారెడ్డి ఓరుగల్లులో చదువుకునే దినాల్లో లకుమయారెడ్డి మహారాజు భూతాది ప్రాభృతాలు పండించటం మానివేయడం జరిగినప్పుడు వర్థమానపురం నుంచి బుద్ధారెడ్డిని ప్రేమించిన కొందరు ఓరుగల్లు వచ్చి లకుమయ్య దుస్తంత్రము గన్నయ్యకు నివేదించారు. గన్నయ్య గరుడునివలె సమస్తరాజకీయాలు గ్రహిస్తూ ఉండెను. ఓరుగల్లు గురుకులాన అతనితోపాటు చదువుకొనుచుండిన రాజకుమారు లందరూ గన్నయ్యను నాయకునిగా ఎన్నుకొని అనేక వినోదాలలో పాల్గొనేవారు.

గన్నారెడ్డి వారందరినీ ఒకనాడు చేరదీసి ఆరుగడియల కాలం ఏమేమో బోధించాడు. ఆ వెనుక గన్నారెడ్డి మూడు నెలలు తమ్మునితో, తనకు సర్వ విధాల బాసట అయిన సూరపరెడ్డితో దేశం అంతా తిరిగాడు. తక్కిన యువకులు అయిదుగురు, ఆరుగురు జట్టులుగా వారివారి సేవకులతో దేశం నలుమూలలా తిరిగారు.

వా రందరూ ఏర్పరచుకొన్న గడువు మూడు నెలలూ దాటగానే ఓరుగల్లులో మళ్ళీ అందరూ కలుసుకొన్నారు.

5

రహస్యంగా రాజకుమారు లందరూ ఓరుగల్లులో గోనవారి నగరులో కలుసుకొన్నారు. గన్నారెడ్డి వారందరినీ చూచి, “అన్నలారా! మనం స్వయంభూనాథుని పాదపద్మాలుసాక్షిగా ఏర్పాటుచేసుకొన్న ప్రతిజ్ఞను అనుసరించి, నేను మీతోపాటు దేశాలన్నీ తిరిగాను. నాకు మన విడిదికి తగిన అద్భుతప్రదేశం శ్రీశైలందగ్గర కనబడింది. ఆ ప్రదేశం పాడుపడిన పురాతన పట్టణం. ఆ పట్టణానికి ఒకటే దారి ఉన్నది. ఆ చాటుదారిని నాకు ప్రాణస్నేహితుడైన ఒక చెంచుదొర చూపించాడు. ఇంకో రహస్యమార్గం ఉంది. తెలియనివాళ్ళు కొన్ని వేల యేండ్లు గాలించినా ఆ పట్టణం దొరకదు. చెంచువారి సహాయంతో ఆ పట్టణం సర్వవిధాలా బాగుచేయించడానికి మా విఠలయ్య, చిన అక్కినప్రగడ గారలు వెళ్ళారు. అది సిద్ధంకాగానే మనం ఒకమంచిదినాన గజదొంగలం అవు