పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

గోన గన్నా రెడ్డి

ఆమె లోనికి వెళ్ళగానే, ఒక వృద్ధ ఆమెకడకు వచ్చి ‘మధుమావతీదేవీ! శ్రీ జాయపమహారాజులంవారు సైన్యంతో బయలుదేరి లకుమయారెడ్డి సైన్యాన్ని ఎదురుకొనేందుకు అవసరమని శివదేవయ్య గురుపాదుల కోరిక. ఇది అతిరహస్యంగా జరగాలి. శ్రీ జాయపమహారాజులంవారు మూడవ సైన్యాన్ని పానగల్లు పంపించివున్నారు. ఆ పానగల్లు పట్టణంలో సారంగపాణిదేవమహారాజు తన సైన్యంతో సిద్ధంగా వున్నారట. నీవుకూడా శ్రీ జాయపమహారాజులవారితో బయలుదేరాలి. సంతోషానికి మీ రిరువురూ బయలుదేరి నట్లుండాలట. అవసరమైతే లకుమయప్రభువు సైన్యాన్ని నాశనంచేసి, లకుమయప్రభువును బందీగాపట్టి సగౌరవంగా ఓరుగల్లుకు కొనిరావలసిందని గురుపాదులు తమ ఆలోచనగా శ్రీమహారాజులంవారికి మనవి చేయమన్నారు’ అని రహస్యంగా నివేదించినది.

శివదేవయ్య దేశికులు శివావతారులని మధుమావతికి నమ్మకం. మధుమావతి భక్తురాలు. రాచరికపు వ్యవహారా లెరిగిన శేముషీసంపన్న. ఆమె శ్రీ శివదేవయ్య దేశికులు భావం అర్ధంచేసుకున్నది. ఆ మరునాడు శ్రీశ్రీ జాయపమహారాజులవారు మధుమావతితో, తన రాణివాసంతో సంగమేశ్వర పుణ్యక్షేత్ర దర్శనానికి పరివార యుక్తులై బయలుదేరారు.

13

రుద్రదేవి తిన్నగా అభ్యంతరమందిరం చేరి, కవచాదులు చెలులు విప్పగా, మరల జవ్వనియై, స్నానగృహానికి వెళ్ళింది. స్నానమాచరించి కులదేవతయైన కాకతీదేవి పూజచేసి, భోజనం పూర్తిచేసి, విద్యామందిరంచేరి పీఠమధివసించి, ఏవో గ్రంథాలు చెలులచేత తెప్పించుకొని, చదువుకొనుట ప్రారంభించింది.

ఎంత గొప్పవాడైనా, ధర్మపాలనాదక్షుడైనా, ప్రజానురంజకుడైనా, వీర విక్రముడైనా ప్రతిమహారాజు అవసానకాలమందూ, సామంతులు తిరగబడడం, ప్రక్కదేశాలరాజులు దండెత్తిరావడం, వారివల్ల ప్రజాక్షోభ కలగడం, కాటకం వస్తూఉండడం జరుగుతూ ఉంటుంది. తన తాతగారి రాజ్యకాలం ఆ కొద్దిసంవత్సరాలూ దేశం అంతా తలక్రిందులైనది. తన పెదతాతగారి చరమకాలం భీషణ వత్సరాలే.

తన తండ్రిగారు ఒక్కొక్కసంవత్సరము ఒక్కొక్కవైపు యుద్ధయాత్రసలిపి ఒక్కొక్కదేశం జయిస్తూ, ఈ సామ్రాజ్యము నిర్మింపవలసి వచ్చినది. నతనాటిసీమ ప్రభువు మేనత్తభర్త; వెలనాటివారు సవతి మేనమామలు. చాళుక్యప్రభువులు తమ కెప్పుడూ అనుకూలురు. ఆరువేలనాడు గిరిసీమ కొండపడమటి తూర్పుసీమలు తమకు చుట్టాలు. సింధనాటిసీమ పాకనాటిని మార్జనాటిని జన్నిగప్రభువు రాజ్యం చేస్తూవుండెను. ఆయన