పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

123

ఆ వెనుక ఉత్తరరంగంలో శృంగారనాట్యం ఆరంభించి ఉత్తమ గీతాలు ఎత్తుకొని మధురమైన కంఠంతో వాచికాభినయమూ, పరమపవిత్రమగు సాత్వికాభినయమూ, మనోహర పద్మలతాహస్తాలతో, పద్మపత్రాక్షులతో, చంద్రబింబాస్యంతో, శంఖగ్రీవంతో, నునుకౌనుతో, ఘనకటితో, రంభోరులతో, పద్మపాదాలతో అంగాభినయమూ, నవరత్నఖచితాలంకారాలతో, దుకూల వస్త్రాదులతో, తనురాగ, లేప కజ్జల, పుష్పరాగాలతో ఆహార్యాభినయమూ ఆ ప్రౌఢ చూపించింది.

ఆమె నాట్యమాడినది కుమారసంభవ యక్షగానము, నవయౌవనవతియైన పార్వతి చెలితో అంటున్నది.

“నాతీ! ఏల నామనసూ నన్నూవిడిచిపోయే
 నా కలలు తోచేనే నాట్యమాడెడు ఒకడూ!
 జటలే తాల్చినవాడు, జాహ్నవి ముడిలో ఆడు,
 చంద్రశేఖరుడమ్మా సుందారీ విను, కొమ్మా!

 అప్పుడు చెలి ఏమన్నది?

“నగరాజూ నీతండ్రి నగుబాటుపాలౌ
 తగదమ్మా ఈ వలపు తలవంపులౌనౌ,

పార్వతి : “నాతో మేలం వద్దు
              నవ్వూలు కావమ్మా;
              నాగభూషణునొకని నలినాక్షి చూచితిని !
              నిద్దుర మెలకువవచ్చి నిలువెల్ల పులకిస్తి
              అద్దిరహృదయము మ్రోగె; అలమె సిగ్గులు నన్ను
                                                                 నాతీ .....
              ఒడలు ఝల్లునపొంగె కడలికెరటము రీతి
              చిడిముడిపాటున మనసు చేడె! వశముదప్పె
              ఎవ్వరే ఆ వయసుకాడు? ఎవ్వరే ఆ జటాధారి
              అవ్వరో! ఆ సుందరాంగుడు అంగముల విభూతివాడె?
                                                                      నాతీ.........
              చేతకలదే ఢక్కఒకటి; చేర్చెవహ్నిని ఇతరకరమున
              నాతి ఆ దివ్యమూర్తే నా తలంపుల నిండిపోయెనే!”

చాళీయమై, లవణియై, విద్యుద్భ్రమరకమై మధుసాని నాట్యము పాల సముద్రవీచికలా, మందమలయానిలంలా చంచలగతిని సభ్యుల ఆత్మలనే కరగించివేసింది.

నాట్యం పూర్తిఅయి ఆమె తాను వేషమువేసికొనే అభ్యంతర మందిరంలోకి రుద్రదేవ మహారాజుయొక్క, ఇతర సభాసదులయొక్క సెలవునంది వెడలిపోయినది.