పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

గోన గన్నా రెడ్డి

మంత్రి గద్దెపై శివదేవయ్యమంత్రులవారు, ఎడమప్రక్క సర్వసైన్యాధ్యక్షుల వేదికపై జాయపసేనానులవారు అధివసించిఉండిరి. వారికి కొంచెం దిగువగా శివదేవయ్యగారికి కుడివైపున ప్రసాదాదిత్యులు, జాయపమహారాజుకు ఎడమగా మహా తలవరి ఉన్నారు.

అక్కడనుండి సభకు ఈవలావల ఆసనాలపై మహాసామంతులూ, సామ్రాజ్యప్రధానులు వారివారి మర్యాదలక్రమంగా పీఠికలపై అధివసించిఉండిరి. రాజప్రతినిధి సింహాసనానికి దిగువగా జగత్ప్రసిద్ధ పండితుల ఆసనాలుంటవి. వారికి దిగువగా రసికోత్తములగు సామంతులు, కళానిధులు, కోటీశ్వరులు, ముఖ్యాధికారులు మొదలైనవా రందరి ఆసనాలూ వుంటాయి. పండిత పీఠాలకు దిగువ ఉత్తమ రత్నకంబళిపరచిన స్థలంలో లాసికాబృందము, మృదంగద్వయం ఈవలావలగా, దేశికులైన పండితులు కుడివైపుగా, చెలియైన వేరొక గణిక ఎడమ వైపుగా మధుసాని నాట్యం చేస్తుంది. మధుసాని వెనుకగా శ్రుతిగాఉన్న గణికా బృందానికి కుడివైపునా, ఎడమవైపునా, ఒకవీణ, ఒక సైరంధ్ర. ఒక రావణ హస్తము, ఒక పిల్లనగ్రోవి ఉంటాయి.

మధుసాని శ్రీ రుద్రదేవప్రభువు ఆజ్ఞప్రకారం సభలో ప్రవేశించి రుద్రదేవికి, శివదేవయ్య దేశికులకు మోకరించి నమస్కరించి, లేచి జాయపసేనానికి తక్కుంగలవారికి నమస్కరించినది.

మధుసాని, కాముని వింటినారివలె బంభరవేణి మధుసాని; పంచబాణుని మందార బాణాలవంటి పీనపయోధరి మధుసాని; మీనకేతనుని కేతనంవంటి బెళుకులాడి మధుసాని; మదనుని చెరకువింటివంటి మధురోష్ఠి మధుసాని, రతితస్వంగి వంటి జవరాలు. మధుసాని నవ్వితే శరత్‌కాలమూ, నడిస్తే వర్ష కాలమూ, మాటలాడితే వసంతకాలమూ, కనులు మూసినచో శీతకాలమూ ఉదయిస్తవి.

అట్టి మధుసాని నాట్యసౌందర్యము ఉత్తమ కళాభిజ్ఞురాలగు శ్రీ రుద్రదేవి చూచి, గ్రహించి, ఆశ్చర్యమంది, ఆనందింపగలిగింది. శ్రీ శివదేవయ్య దేశికులు ఆమెనాట్యంలో ఉదయసంధ్యానటేశ్వర నృత్యచ్ఛాయలు చూచి ఆనందించినారు. తక్కిన వృద్ధులు, కౌమారులు, యౌవనులు అందరూ మహామధురనాట్యముతో కూడిన ఆమె సౌందర్యంలో మనస్సులను శలభాలు చేసుకున్నారు.

“ఓం వినాయక, విఘ్నరాజం వందే!
 ప్రమథ గణేశ్వర పాహిమాం, పాహిమాం!”

అని పూర్వరంగము ప్రారంభించింది. నాట్యభేదములలో ఇరువదినాలుగవదియగు పుష్పాంజలి నాట్యముతో ప్రారంభించి భృంగినాట్యముతో సమాప్తం చేసింది.