పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

125

రాజభక్తి తంగయసాహిణి రాజభక్తికి వన్నెలు దిద్దుతుంది. ఇటు మానువ నాటి సీమలో రాజద్రోహం పూర్తిగా తలఎత్తింది. ఒక ప్రక్క ఈ గజదొంగ గన్నారెడ్డి, వేరొకప్రక్క అతని పినతండ్రి లకుమయమహారాజు యుద్ధం చేయబోతున్నారు. గన్నారెడ్డి ఎంత గజదొంగ అయినా సాధ్యమైనంతవరకు ప్రజా సంహారం లేకుండా వైరిసంహారముమాత్రం చేస్తున్నాడు. అది అంతవరకు నయం. ఈలా రాజ్యాలు పాలించేవారి తలపై ఉన్నభారం శేషునిభారానికి వేయిరెట్లవుతున్నది. రాజుల కెందు కీ ఆశ! ఈ ఆశతో ఎన్ని సామ్రాజ్యాలు జన్మించి నాశనమవుతున్నవి! రాజ్యాలకోసం బలమైనవాడల్లా ప్రయత్నంచేస్తూ తోటిరాజుల్ని, తనసైన్యాల్నీ హింసిస్తూ శాంతియుతమైన దేశాలలో సంక్షోభం తీసుకువస్తూ ఉంటారు.

రుద్రదేవి తాటియాకులపుస్తకం చూస్తున్నా, ఆమెమనస్సు ఈలా ప్రపంచ యాత్ర చేస్తున్నది.

ఆమె ఈ దినాలలో తన నగరిలో యువతి. మహారాజసభలో పురుషుడు! ఆమెకు శ్రీ శివదేవయ్య దేశికుల భావం పూర్తిగా అర్థమైనది. ఆమె సంపూర్ణ స్త్రీయై, ఆ ఉత్తమపురుషుడు, .... ఆ ఉత్తమచాళుక్యుడు.... ఆ.....ఆ చాళుక్యవీర భద్రుని ఎదుట నిలుచున్నది.

చాళుక్యవీరభద్రమహారా జానాడు తన్ను సంపూర్ణస్త్రీగా తోటలో చూచుట కామె పొందిన యానందము వర్ణనాతీతము. ఎప్పు డా మహాభాగుడట్లు ప్రత్యక్షమైనాడో, ఆ శుభముహూర్తములో తనలో ఉన్న అనంతానుమానాలన్నీ సూర్య కాంతికి మంచుకరిగినట్లు కరిగిపోయాయి. ఆ దివ్యపురుషుని ఎదుట తన జనకుడూ, తానూ, తనచుట్టూ నిర్మించిన పురుషత్వదుర్గకుడ్యాలు, బురుజులు రాలిపోయినవి. తాను స్త్రీయై జన్మించినకథకు, ఫలశ్రుతి అమృతకలశోపమానమై ఆనాడు ప్రత్యక్షమైనది. తన ఒడలు ఝల్లుమన్నది. తన దేహము ఉప్పొంగినది. తన హృదయము. మత్తిల్లినది. కన్ను లరమూతలు పడినవి. తన పెదవులు వణకిపోయినవి, ఫాలమున చిరుచెమ్మటలు పోసినవి. కంఠాన మధుబిందువు లలమిపోయాయి.

ఆ సాయంకాలము తా నెట్లింటికి వచ్చినదో? ఇంతలో దేశికులూ, ఆ ప్రభువూ తన్ను రుద్రదేవమహారాజుగా చూడడానికి వచ్చారు. లొంగని గుండెను దిటవుపరచుకొని వారికి తాను దర్శన మిచ్చింది. వారితో మాట్లాడిన ఆ కొలది కాలమూ తనకు అసిధారావ్రత నిర్వహణ మయినది.

తా నా మహాపురుషుని ప్రేమించుచున్నమాట నిశ్చయము. భగవంతుని మనం ప్రేమించమా? అంతియ ఈ ప్రేమయున్నూ, దూరాన్నుండే అ దివ్య పురుషుని ప్రేమిస్తూ, ఈ రాజ్యనిర్వహణరథం నడుపుకుంటూ, తనధర్మం తాను ఆచరిస్తుంది. అవివాహిత అయిన స్త్రీకి రాజ్యార్హత లేదంటారు. తన