పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

111

వర్ధమానపురంనుండి ఒకలక్షసైన్యంతో గోన లకుమయారెడ్డిప్రభువు స్వయంగా కేశినాయని సహాయానికి వస్తున్నారని విఠలధరణీశునికి వేగువచ్చింది. ఆయన అన్నగారితో ఆలోచించినారు. ఆ వేగువచ్చిన మరునిమేషంలో గన్నయ్య ప్రభువు ‘కోటమీదకు ఉరుకుతున్నా’ నని కేశనాయకునికి వార్త పంపి, ఇచ్చిన గడువు దాటిన మరునిమేషంలో కోటి పిడుగు లొక్కసారి విరుచుకు పడినట్లు కోటమీదకు ఉరికిరి ఒక్కసింహద్వారంపై ఆయన పెట్టిన ఒత్తిడి మహాపర్వత పక్షాలను ఛేదించే వజ్రపాత భయంకరమై మూడు గడియలలో ద్వారమును ముక్కలు చేసింది. తక్కిన ద్వారాలకడ ఒత్తిడి నటింపబడింది. గోడలపైకి ఎవ్వరూ వెళ్ళలేదు. కోటముఖద్వారం వెనుకకు కొన్ని వేల అగ్నిబాణాలు వర్షం కురిసినవి. బురుజులనుండి, గోపురగృహాలనుండి, లగ్గలనుండి శత్రువులు సంతత ధారగా వర్షించే ఆగ్నేయాది శస్త్రాలను లెక్కచేయక గుమ్మాన్ని కూల్చివేసినారు.

“మహారాణీ! పైనుండి కరగించిన ఇనుము, సీసము, కుతకుతలాడే నీళ్ళు పోశారు. మా వాళ్ళు కొందరు నాశనమయ్యారు. కాని మేము మోసుకు వచ్చిన కందనోలు శలాఫలకవితనాలు మాకు గోవర్ధనపర్వతాలైనవి. ఈ ఉపాయము గన్నారెడ్డి ప్రభువుదే.

“పై నున్న విరోధుల్ని చీల్చిచెండాడే నిశితశరపాతము, గంధకాస్త్ర పాతం ఊపిరాడకుండా మా వాళ్ళు కోటగుమ్మాలకడ లేవనెత్తిన ఉన్నతమైన పందిళ్ళ మీదనుండి కురిపిస్తున్నారు.

“మూడుగడియలలో మా ఏనుగుల తాకుడునకు, మా యంత్రములతాకుడునకు కందూరు దుర్గద్వారక వాటలూ రెండూ ఫెళ్ళున వెనక్కు విరిగి పడిపోయాయి. నిండివున్న మహాతటాకానికి గట్టుతెగితే వచ్చే ప్రవాహ ప్రపాతంలా మావాళ్ళు లోనికి చొచ్చుకుపోయారు. సంకులసమరంలో కొన్ని విచిత్రవిధానాలు గన్నయ్యమహారాజు మాకు నేర్పారు. సాంకేతికాలతో మాకు ఎదిరిని తెలుసుకోవడము, మా వారిని తెలుసుకోవడము అతిసులభం. మావా ళ్ళెప్పుడూ ముగ్గురు, అయిదుగురు, ఆర్గురు, ఎనమండుగురు ఉంటారు. అంతకన్న పెద్దజట్టు ఉండకూడదు. ఈ జట్లు విడిపోరు.

“ఒక ద్వారం పడిపోగానే తక్కిన ద్వారాలు లోనికి వెళ్ళినవారే తెరిచారు. రెండు ఘటికలలో యుద్ధం పూర్తి అయినది. రాచనగరిలో మాత్రం యుద్ధం చెలరేగుతున్నది. గన్నారెడ్డిప్రభువు, విఠలప్రభువు గండరగండలై వీరులతో నగరిని భేదించి లోనికి ఉరికారు. ఆ దినాన మా గన్నారెడ్డిప్రభువు ఎవ్వరూ తేరి చూడలేకపోయారు. సింహమై, శరభమై, పాశుపతాస్త్రమై శత్రువులను వేలకువేలు పలాయితులను చేయుటే కాని ఏపది పదిహేనుమందిని తప్ప సంహరించలేదు.