పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

గోన గన్నా రెడ్డి

“ఆయన కా కోపంతీరి, సాయంకాలపు సూర్యబింబంలా శాంతమూర్తి అయ్యేసరికి ఆయన ఎడమపాదం కందూరి కేశనాయని హృదయముమీద ఉన్నది. నాయనిదేహం రెండుఖండాలుగా చీలిఉన్నది.”

కుప్పసానమ్మా, అన్నాంబికా ఒక్కసారిగా కన్నులు మూసుకున్నారు.

“మహారాణీ! యుద్ధసమయంలో ఉత్తమమనుష్యుడు రుద్రమూర్తి అవుతాడు. నీచుడు పిశాచి అవుతాడు, గన్నారెడ్డిప్రభువు ప్రళయకాల రుద్రుడు, చక్రధర విష్ణువు.

“ఆయన వెంటనే కేశినాయకుని శవాన్ని గౌరవంగా, అతని కుటుంబానికి అప్పగించి, రాత్రి ప్రథమయామ మధ్యమందు తన సర్వసైన్యముతో మాయమయ్యాడు. ఈలోననే చక్రవర్తిసొమ్ము కేశినాయుడు దోచిన ధనము చక్రవర్తి కడకు కొన్ని దళాలు తీసికొనిపోయినవి.

చినదామానాయుడు కథ ముగించగానే అన్నాంబికా రాకుమారి లోనికి తుఱ్ఱున వెడలిపోయి చెలికత్తె నొకదానిని పిలిచి, వెలపొడుగు వస్త్రాదికములు, కొన్ని వజ్రములు దామానాయనికి ‘ఒక చెల్లెలు అర్పించిన’ వని బంగారు పళ్ళెరాన పెట్టి పంపినది.

మల్యాలనగరిలో మహోత్సవములు జరిగినవి. సేవకబృందానికి ఎన్నియో బహుమతు లీయబడినవి, బీదలకు అన్న వస్త్రదానములు చేయబడినవి.

ఆ దినమందే శ్రీరుద్రదేవమహాప్రభున కీవార్త తెలిసి వా రాశ్చర్యమందినారు. గజదొంగ గోన గన్నారెడ్డి ‘కందూరి కేశినాయక తలగొట్టుగొండ’ అయినాడా! అనుకొన్నారు.

కందూరు విడిచి గోన గన్నారెడ్డి మాయమైన మరుసటి ఉదయానికి గోన లకుమయారెడ్డి లక్షసైన్యంతో వచ్చినాడనిన్నీ, తన అనుగుభృత్యుడైన కేశినాయకుడు గన్నయ్యచే వధింపబడినాడని తెలిసి, ఆ మహాప్రభువు ప్రళయ ఝంఝామారుతానికి వణకిన మహావృక్షంలా వణకి, కోటలో పదివేలసైన్యం కాపువుంచి గన్నరాక్షసుని పట్టుకొనడానికి వెంటనే తక్కిన తొంబదివేల మహా సైన్యంతో బయలుదేరాడనిన్నీ శ్రీశివదేవయ్య మంత్రికి వేగువచ్చింది.

లకుమయ్య శ్రీ శ్రీ రుద్రదేవ ప్రభువునకు వ్యతిరేకించదలచిన రాజ ద్రోహులలో ఒకడని శ్రీ శివదేవయ్యదేశికులకు పూర్తిగా తెలుసును.

‘దూరదృష్టిలేని మూర్ఖులు తాము పన్నిన జాలంలో తామే పడి నాశనం అయిపోతారు. ఆ గజదొంగపైకి పోయి లకుమయ్య నాశనమైపోతాడు. ఈవిచిత్ర యుద్ధము గమనింపవలసినదే! గన్నయ్య తన పినతండ్రిని నాశనంచేయ ఇష్ట పడునా? ఇష్టమున్నా నాశనం చేయగలడా? ఎంత తీసినా లకుమయ్య గోన వంశారణ్య వృద్ధసింహమే. ఈ రెండు సింహాలలో ఏది విజయమందగలదో’