పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

గోన గన్నా రెడ్డి

తెల్ల బోయిచూచినాడు. తన చుట్టుప్రక్కల పారచూచినాడు. ఎక్కడ చూచినా గన్నారెడ్డి సైన్యాలే అతని కంటికి కనపడ్డాయి.

“ఓరి గజదొంగా! రాక్షసుడా! నీకు దొరికాను, ఇకనేమి? చంపు’ అని కేశినాయకుడు - ఏడుపువస్తూంటే ఆపుకొంటూ మాట్లాడేబిడ్డలా - కేకవేశాడు. గన్నారెడ్డిప్రభువు పకపకనవ్వి ఓయీ దుర్మార్గుడా! నేను గజదొంగనా? చక్రవర్తి ధనం ఓరుగల్లు వెడుతూంటే నేనా దోచింది? నేనా ఆ చిన్నదళాన్ని పెద్ద సైన్యంతో వెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఒక్క మనిషన్నా మిగలకుండా నరికిపార వేసింది? ఏమిరా పిరికిపందా! కోట దుర్భేద్యం చేసుకొని, గోడల వెనుక దాక్కొని రాజప్రతినిధి శ్రీరుద్రదేవ మహారాజును వినరాని మాటలనే గజదొంగను నేనటరా? మాట్లాడవేం? నోరు వాతంకమ్మి పడిపోయిందా? ఓరి నీచుడా, నేను ద్వంద్వయుద్ధానికి రమ్మనడానికి కూడా నువ్వు తగవు. నీ కుట్రలన్నీ నాకు తెలిశాయి. నాకు రాజ్యం లేదని విచారంలేదు. కాని లోకంలో నీబోటి తుచ్ఛులు, స్వలాభపరాయణులైన పురుగులు, నిర్మల నీలాకాశంలా ఉన్నదేశాన్ని మహా ప్రళయ ఝుంఝూక్షుభితం చేస్తారు! పో! నీకోటలోనికిపో! ఇక ధర్మవిజయం చూడు. నీ కోటలో నిన్ను నా కున్న ఈ కొద్దిసైన్యంతోనే మట్టం కావించి లోకానికి నీతి చాటిస్తాను’ అని నవ్వుతూనే చెప్పినారు మహారాణీ!”

కుప్పసానమ్మ: పసిపాపలను ఉపలాలించే మా తమ్ముల చిరునవ్వు నే నెరుగనా?

చినదామా: మహారాణీ! గన్నారెడ్డిమహారాజుల అపారకరుణ వారితో రెండుదినాలు మెలిగినవారికి తెలుస్తుంది. తనసైన్యంలో చెంచులూ, కురమలూ, కడజాతివారినికూడా దయామయుడైన మా ప్రభువు ప్రేమతో ఆదరిస్తారు. అంత చిన్నవారైనా ఆ ప్రభువు మాకు తల్లీ, తండ్రీకూడా మహారాణీ!

రేచర్ల చినదామానాయని మాటలు వింటోంటే అన్నాంబిక హృదయంలో ఆనందం ఉప్పొంగిపోయింది. ఆమె కన్నులవెంట ఆనందాశ్రువులు అమృతబిందువులై ప్రవహించినాయి.

తన ప్రభువు, తన నాయకుడు, తన ఆత్మేశ్వరుడు భగవదంశసంభూతుడు. ఆ ప్రభువునకు తాను సేవచేస్తూ వేయిజన్మాలు గడిపినా తనకు తృప్తితీరదు. ఈ మహావీరుడే తనకు రాజాధిరాజు, భగవంతుడు.

అర్ధనిమీలితాలైన ఆ బాలిక విశాలనయనాలలోనుండి స్రవించు ఆనందాశ్రువుల గమనించి చినదామానాయని కన్నులలోనే నీళ్ళు తిరిగినవి. ఆ అశ్రువులను కంటితోనే మ్రింగి వెంటనే తన కథనము సాగించినాడు.

“మహారాణీ! కేశనాయకప్రభువు తలవాల్చికొని కోటలోనికి వెళ్ళి పోయినాడు. రెండురోజులు మేమూ వారూ చల్లగా ఊరకొంటిమి. ఇంతలో