పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

గోన గన్నా రెడ్డి

కుప్పసానమ్మ: మా తమ్ముడికి వెఱ్ఱికోపం వచ్చిఉండాలి!

రేచెర్ల: ఆఁ! గన్నప్రభువు పక పక నవ్వాడు. ఆయన పకపక నవ్వితే మేమంతా ఉప్పొంగిపోతాము. మా విరోధులంతా గజగజలాడిపోతారు.

కుప్ప: ఎవరయ్యా మీ విరోధులు?

రేచెర్ల: ధర్మద్రోహులంతా మా విరోధులండీ.

అన్నాం: అప్పుడేమైంది మహారాణీ?

రేచెర్ల: వెంటనే తనదగ్గరఉన్న సగం దండును సిద్ధంకమ్మని ఆజ్ఞ ఇచ్చా రా ప్రభువు. మేమంతా సిద్ధం అయ్యాము. ‘దొంగలా కోటదూరి దాకొన్న ఆ హీనుణ్ణి ఆ కోటలోనే మనం జుట్టుపట్టి లాగి ఈవలవైచి హతమార్చాలి’ అని మా కాజ్ఞ.

‘ఆ రాత్రి ప్రయాణం. మాసైన్యం ఎనిమిదివేలు. అందరూ సింహాలు. ఇంచుకంతైనా అలికిడిలేకుండా మరునాడు తెల్లవారేసరికి ఎక్కడివారక్కడ మాయమైపోయారు. చిన్నచిన్న యాత్రికుల జట్టులలా ప్రయాణం చేయాలని నాయకుని ఆజ్ఙ. ఆ రాత్రికి కందూరు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నిటిలో మావారు అణిగి ఉన్నారు. రాత్రి ఒకజాము గడిచేసరికి కందూరు కోటచుట్టూ మాసైన్యం చేరింది.’

7

“చేసినతప్పు ఎలాగాచేశాడు, తనకు భయమేమిటి” అని కేశినాయకప్రభువు అనుకొన్నాడు. కేశినాయక ప్రభువు చాలాకాలంనుంచి కోట బాగుచేయించుకొని లగ్గలపై మేటివిలుకాండ్లను, అప్రమత్తులైన ఆగ్నేయశస్త్రాయుధులను, శిలాయుధ ప్రయోగ నిపుణులను కాపలా పెట్టాడు. నగరికోటచుట్టూ ఉన్న అగడ్తలోనూ పూర్తిగా జలం నింపి, భయంకరమైన మొసళ్ళను ఆ అగడ్తలలో వదిలాడు. కోట ద్వారాలదగ్గర బురుజులలోను మెరికలలాంటి శూరుల్ని హెచ్చరికమై నిలిపిఉంచాడు.

“దెబ్బతిని పడిపోయిన వారిస్థానంలో వెంటనే నిలబడేటందుకు, అలసట పొందినవారిస్థానే వచ్చేటందుకు శూరులు సిద్ధంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చిన మరునిమేషంలో తలుపులు తెఱచుకొని కోటబయటఉన్న శత్రువులను ఖండఖండాలుగా నరికివేయడానికి, కసకసత్రొక్కివేయడానికి, తరిమితరిమి నేలమట్టం చేయడానికి ఏనుగులు, అశ్వికులు, రథికులు నగరగోపురద్వారాలకడ, కోటగుమ్మాలకడ సిద్ధంగా ఉన్నారు. వీధి వీధి, ఇల్లు ఇల్లూ కోటలైపోయాయి.