పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

107

శత్రువుల ఒత్తిడి ఎక్కువైతే వెనుకనుంచి పోయి ఇతరప్రదేశాలు ఆక్రమించడానికి తగువిధానాలు అమరింపబడినాయి. అవసరమైతే ఇళ్ళూ, వీధులు తగలబెట్టి శత్రువుల అరికట్టడానికి కట్టుదిట్టాలు జరిగాయి.

ఈ సర్వసన్నాహం గోన గన్నయ్యకు వేగువచ్చింది. ఇంత జాగ్రత్తపడ్డా కేశినాయుడు కలలో కల, ఆలోచనలో ఆలోచనవంటి గన్నారెడ్డిని ఎల్లా నలువరింపగలడు?

కందూరులో గోన బుద్ధారెడ్డిసాహిణి పరాక్రమం, ఔదార్యం, ప్రేమ రుచి చూచినవారు వేలకువే లున్నారు. బుద్ధారెడ్డి మహారాజు పేరు చెప్పి దీపాలు పెట్టుకొని మొక్కులిడే తల్లులు ఆ నగరమంతా నిండి ఉన్నారు. వారందరికీ శ్రీ సర్వ భూమండలాఖండులైన గణపతిదేవ చక్రవర్తిపేరు విన్నంతనే భక్తి ఉట్టిపడుతుంది. వారేకదా కళ్యాణిరాజు గర్వం అణచి, భల్లాణుల పొగరు నాశనంచేసి, యాదవుల మదం నీటగలిపి దేశంలో శాంతం నెలకొల్పిన ప్రభువు! దేశంలో యుద్ధంవస్తే వానలు భయపడి పారిపోతాయి; మనుష్యుల ఆగ్రహాల మంటలకు నదులూ, చెరువులూ ఎండిపోతాయి. కరువు ‘అమ్మతల్లిలా’ విజృభించి సంహార తాండవం చేస్తుంది.

అపర రామచంద్రావతారమైన సప్తమచక్రవర్తి గణపతిదేవ ప్రభువులు బ్రతికిఉండగానే కేశినాయక ప్రభువునకు చెలగాటమా! అని ప్రజలు వణికిపోయారు.

ప్రజలందరూ బుద్ధారెడ్డి మహారాజు కొమారుడు, వీరవిక్రముడు గన్నారెడ్డి ప్రభువు అడవులుపట్టి పోవడం సహించలేకపోయారు. అదీగాక గన్నారెడ్డి లోక మోహనమైన వీరవిక్రమాలు వింటున్నారు. అతని తమ్ముడు విఠలధరణీశుడు అపర భీముడు. ఈ భీమార్జునుల జట్టులో శరభాలలాంటి, గండభేరుండాలలాంటి మహా వీరులు, యువకులు చేరారు.

“కందూరు నగరవాసులైనబాలురే గన్నారెడ్డి జట్టులో మేయిమందిఉన్నారు. గన్నారెడ్డి సైన్యంలో శిక్షణ పొందినవాడు పులిమీసాల పట్టి ఆడించగలడు. ఈ వేయిమంది బాలురు కందూరుపురంలో అనేక వేషాలతో చేరారు. కేశినాయక ప్రభువులు చేసిన దారుణచర్య వారి వారి చుట్టాలకు చెప్పారు. ఆ బందుగులలో వీరులు కేశినాయని దురంతానికి ఉగ్రులైపోయారు.”

ఇంతవరకూ కథచెప్పి ఆ చినదామానాయకుడు పిల్లలమఱ్ఱిప్రభువు రెండవ కుమారుడు పకపక నవ్వి ‘మహారాణీ! మా నాయకుని ఎత్తులు ఇంతవరకు ఎవ్వరూ పన్నలేదు. ఇక ముందున్నూ ఎవ్వరూ పన్నలేరు. స్వజన నష్టం కాకూడదు; విరోధులు దాసోహం కావాలి. అది గన్నయ్య మహారాజుకు మూలధర్మం’ అన్నాడు.