పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

105

మొదట సార్వభౌములపేర అర్చన జరిగింది. గురుమల్లి కార్జున పండితారాధ్య తనయులు శివారాధ్యులవారు స్వయంభూదేవర కర్చన జరుపుతున్నారు. శివనామమంత్ర పఠనంతో, గీతాలాపాలతో ఆ దేవాలయం అంతా మారుమ్రోగుతున్నది.

ఇంతలో మల్యాలప్రభువుల అర్చన వచ్చింది. వేయి నారికేళాల అభిషేకం జరిగింది. ఆరాధ్యులకు, వీరశైవులకు, మాహేశ్వరార్చన జరిగింది. బ్రాహ్మణులకు అన్నదానం జరిగింది. కుప్పసానమ్మ భూదానాదుల శాసనాలు వ్రాయించి మహా పండితులకు ఇచ్చింది. అన్నాంబిక పరవశురాలయి, సంతత శివనామోచ్చారణ పులకితయై గన్న ప్రభువునకు విజయాన్ని సమకూర్చినందుకు భగవంతునకు నిలువు దోపిడు లిచ్చింది. వివిధ దేవాలయాలలో పూజలన్నీ పరిసమాప్తి చేసికొని వారు తమ నగరు చేరుకొనేసరికి సాయంకాలం మూడవయామంకూడా దాటింది. అప్పుడు వారు భోజనాలు నిర్వర్తించి, అన్నాంబికాదేవి మందిరం చేరినారు.

అక్కడకు గన్నారెడ్డికడనుండి వచ్చిన వార్తాహరుని వారు రప్పించికొనిరి. రేచెర్ల ప్రభువంశంలోని ఆ పడుచువాడు కుప్పసానమ్మతో ‘మహారాణీ! కందూరి కేశినాయకుడు వర్ధమానపురంవారికి సామంతుడు. గోన గన్నారెడ్డి ప్రభువు రాజ్యార్హుడుకాడని అతడు వాదించాడు. వెనుక వరదారెడ్డిని మేము పట్టుకొని పీటలమీది పెళ్ళిని తప్పించినప్పుడు తాను గన్నారెడ్డిని పట్టుకుంటానని ప్రగల్భాలాడిన మహా వీరుడు. ఈ వార్తలన్నీ మా నాయకునకు అందినా అప్పుడు చిరునవ్వునవ్వి ఊరుకొన్నారు. కొద్దిదినాలక్రిందట చక్రవర్తిగారి సుంకాలధనం, ఇతరధనాలు, భరు కచ్ఛాన్నుండివచ్చే కోట్లు పణాలు విలువచేసే వస్తువులు, అన్నీ మా రేచెర్లవారిలో ఒకవీరుడు, ప్రసాదాదిత్యనాయక బాబయ్యగారి అన్నకుమారులు కతిపయసైనికులు వెంటరా పట్టించుకు వస్తూ ఉండెను.

ఆ సమయంలో ఈ కందూరి కేశినాయుడు పటాటోపంతో ఆడది రాజ్యం చేయడం, దానికి ఈ విలువగల వస్తువులు వెళ్ళడం అన్యాయం. ఇంతమంది మహా వీరులు ఉంటూఉంటే గణపతిదేవప్రభువు ఆడదానికి రాజ్యం అప్పగిస్తాడా? ప్రభువులంతా ఆడవాళ్ళయ్యారనుకున్నాడా?’ అంటూ పెద్ద సైన్యంతోవచ్చి, ఆ రేచర్ల ప్రభువును చంపి, చక్రవర్తి సైన్యాన్ని నాశనంచేసి, ఆ సంపద యావత్తు దోచుకొని కందూరినగరం చేరాడు.

కుప్పసానమ్మ: ఎంత అన్యాయం! ఎంత దౌర్జన్యం!

అన్నాంబిక: శ్రీ రుద్రదేవప్రభువులను అలా ఈసడించి మాట్లాడడమే?

రేచెర్ల చినదామానాయుడు: ఈ వార్త మాకు మరునాడే తెలిసింది మహారాణీ!