పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చంద్రవంకలో ఉత్తరం కొమ్ము ఎక్కువుంటే ఉప్పుధర పెరుగుతుందని, దక్షినకొమ్ము పెచ్చుంటే ధాన్యంధర పెరుగుతుందని భావిస్తారు. కొత్తయింటికి దృష్టి దోషం తగలకుండా బూడిదిగుమ్మడికాయ ఇంటిముందు వేలాడదీస్తారు. దెయ్యాలు మీదపడకుండా పిల్లల మొలత్రాడుకు తోలుముక్కకడతారు. ఎక్కడికైన వెళ్లేటప్పుడు ఎక్కడికని అవరైనా అడిగితే వెళ్లేపని జరగదంటారు. తలమీద చేతులు పెట్టుక్కూర్చుంటే దరిద్రమట.

పసిపిల్లలకు అద్దం చూపిస్తే మీద పళ్ళొస్తాయట. మీదపళ్ళొస్తే మేనమామలకి కీడని నూనె మండిగలో ఆబిడ్డముఖం నీడచూపించి చాకుతో ఆబిడ్డ బొట్టునీడపై పొడిపించి రోలుమీద కొబ్బరికాయల్, వెలక్కాయలు కొట్టిస్తారు. తెల్లవారుజామున వచ్చిన కలలు జరుగుతాయంటారు. దీపాలు పెట్టాక ఇల్లు తుడిస్తే లక్ష్మి పోతుందట. ఏకాదశి, మహాశివరాత్రి, సంక్రాంతి భోగి, మకర సంక్రమణం రోజుల్లో చనిపొతే పుణ్యలోకాలు వస్తాయంటారు. ఒంటిమీద సాలెపురుగు ప్రాకితే కొత్తబట్టలుతొడుగుతారంటారు. పిడుగు పడేటప్పుడు అర్జున, ఫల్గుణ, పార్ధ, కిరీటి, శ్వేతవాహన, సవ్యసాచి, భీభత్స, కృష్ణ, విజయ, ధనుంజయ అని అర్జునుని పదిపేర్లూ చదివితే పిడుగు దగ్గరక్ రాదట. ఇంటిలో బూరుగుచెట్టు, కుంకుడుచెట్టు, ఉసిరిచెట్టు ఉండరాదంటారు. గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలమీదా, ఊరగాయలమీదా దర్భ ముక్కలు వేసుకోవాలంటారు--లేకుంటే వానిలో పామువిషం క్రక్కుతుందట. పిల్లలకు దృష్టిదోషం తగిలిందనుకున్నపుడు 3 ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపిదిష్ఠితీసి మండుతున్న పొయ్యిలో వేస్తారు. ఆ మిరప కాయలుకాలి ఘాటు రాకుంటే దిష్ఠితగిలినట్టు లెక్కట.

గ్రద్ధగాని, తీతువుగాని యింటిమీద వాలితే అశుభం. ఆంజనేయ దండకం చదివితే దెయ్యాలు దగ్గరకు రావట. చెప్పులూ, చీపుర్లూ తలదగ్గర పెట్టుకు పడుకుంటే దెయ్యాలు మీదపడవట. అరటిగెల కోసేసిన్ వెంటనే ఆచెట్టు కొట్టేయాలట. అలా కొట్టెయ్యకుండా ఉంచితే చూసిన పుణ్యస్త్రీలకు వైధవ్యం వస్తుందట. సాయంకాలం పసిపిల్లల్ని వాకిళ్లలో పడుకోబెట్టిన పిట్టరూపు వస్తుందని, అలా వచ్చినవాళ్ళకి ఆరూపు మార్చడంకోసం ఆంబిడ్డని తూములో ప్రవేశపెట్టి వెలికి తీస్తారు.