పుట:Gidugu Rammurthy Mundu matalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందుమాటలు


'లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా' రికార్డులలో రోమను లిపినే వాడారు. అయితే అందులోని లోపాలు స్పష్టంగా కనబడతాయి. అనేక రకాల ధ్వనులకు ఒకే అక్షరం వాడవలసి వచ్చినపుడు దానిని ఎన్నో గుర్తులతో వివరించవలసి వస్తుంది. ఉదాహరణకు నాలుగు విధాలైన 'అ', 'ఐ', 'ఔ', ధ్వనులకు ఒకే అక్షరం వాడుతాము. "మానసిక శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, అచ్చు అక్షరాలనుపోత పోయువాడు వీటిని త్రోసిపుచ్చుతాడు."[1]

ధ్వని సంబంధిత అక్షరమాల కూడ ఉజ్జాయింపుగా ఉండేదే అని విద్యార్థి గ్రహించాలి. వినికిడిధ్వనులను కనబడుసంకేతాలేవీ నిర్దుష్టంగా నివేదించలేవు. ముందుగా భాషాధ్వనుల ఉచ్చారణను సోరలవద్ద నేర్చుకోవాలి. తరువాత మాన్యుయల్ లోని ఉదాహరణలలో ఇచ్చిన మాటలను వాక్యాలను వారివద్ద చక్కగా ఉచ్చరించేదాకా మళ్ళీ మళ్ళీ అంటుండాలి. సోర అక్షరమాలలో కొత్త శబ్దాలు తక్కువే ఉంటాయి. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, లేకపోతే కొన్ని రోజుల అభ్యాసమువలన ఎటువంటి పాఠాన్నయినా విద్యార్థి తడుము కోకుండా వెంటనే చదువగలడు.

క్రైస్తవ మిషనరీలు, అభివృద్ధిలేని భాషలను వ్రాయుటకు ధ్వనిలిపినే ఎల్లపుడూ వాడతారు. మత గ్రంథమయిన బైబిలేకాదు వాచకాలు కూడ వాటితోనే చాలా భాషలలో ప్రచురించారు. ఈ ధ్వనిఅక్షరమాల టర్కీలో వారి సంప్రదాయ అక్షరమాలకు బదులుగా వాడుకలోనికి వచ్చింది. హీబ్రూ భాషకు గూడ దీనినే ఉపయోగించే ఆలోచన ఉన్నది. విదేశీయులు, చీని జపాను భాషలను ధ్వనిలిపి ద్వారానే అభ్యసిస్తున్నారు. ధ్వనిలిపిని ఉపయోగించుటవలన భారతదేశంలో విభిన్న మాండలికాలను తొలగించలేకపోయినప్పటికీ విభిన్న లిపులను తొలగించవచ్చును. ప్రాథమిక వాచకాలను పాఠ్యపుస్తకాలను అంతర్జాతీయ ధ్వనిలిపిలో సోరపిల్లలకు నేర్పుట వలన కలుగు సదుపాయమును నేను, నా కుమారుడు జి.వి. సీతాపతి సోరాఏజెన్సీలోని సెరంగోలో 1930 నవంబరు 3వ తేదీ నాడు టి. ఆస్టిన్ ఐ.సి.ఎస్. దొరగారు నిర్వహించిన దర్బారు సమయమున ప్రదర్శన ద్వారా నిరూపించాము.

ఆ ధ్వని లిపిని ఉపయోగించే పద్ధతి విద్యార్థులకు ఈ మాన్యుయల్ లో తగినచోట చెప్పబడింది. సోర భాషలోని ముఖ్య లక్షణాలు అవగతము కావించుటకు తగిన శ్రద్ధ చూపబడింది. అంతటా సోర భాష ఒకే విధముగా ఉండదని తెలుసుకోవాలి. ఈ భాష ముఠాకు ముఠాకు, గ్రామానికి గ్రామానికి మారుతుంది. ఒకే గ్రామములోకూడ ఉచ్చారణ


  1. మానవజాతి శాస్త్రంపై వివరణలు, ప్రశ్నలు - పేజీ 362