పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కష్టసుఖ మెఱుగని పసికందుబిడ్డ
చందమున గంతులేసెదు చందమామ!
కాలపరిపాకమున నీకు గల్గబోవు
గతి దలంపుము నిశ్చలమతిని సుంత!

    అంధకార మలీమసం బౌచు జగతి
    ప్రళయకాలమహాబ్ధి నిర్మగ్న యట్ల
    చూడ దుర్బేధ్య మౌనప్పు డేడ బోవు
    నీదు రాచఱికంబు వెన్నెలయు, చంద్ర!

కష్టభాగ్యుడనౌ నన్ను గాంచి మంద
హాసమున పరిహసించెద వౌర, చెలియ
చెంత లేదనియేన? నీవింత యొడలు
మరచి నన్నిట్లు మతిమాలి పరిహసింతు?

    పలవ! పోపొమ్ము నీతోడ వాదులేల?
    చలువ తిన్నియపై ముద్దు చెలియమోము
    మోహపారవశ్యంబున ముద్దు గొంచు
    బుద్ధి జెప్పింతు పొమ్ము నీ పొగరడంగ.