పుట:Geetham Geetha Total.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్జునుడిట్లనియె :-

12. తే. పరమధాముఁడవును బర బ్రహ్మవును బ
విత్రుఁడవు శ్రేష్ఠుఁడవు నీవు విశ్వరూప !
దివ్యుఁడవు శాశ్వతుఁడ వాది దేవుఁడవును
బురుషుఁడవు విభుఁడ వజుండ వరయ నీవ.

13. తే. అనుచు నారదుఁ డాదిగా నఖిలఋషులు
నసితుఁడును దేవలుండును వ్యాసమౌని
యును వచింపఁగఁ బలుమాఱు వినుటగాక
విశదముగ నీవ చెప్పఁగా వింటిఁ గాదె?

14. కం. ఎది నాకుఁ జెప్పితో నీ,
వది యెల్లను నిశ్చయంబెయగు; నీ విషయం
బిది దేవదానవులకును
విదితము కాఁగలదె? నీవు వినిపింపనిచోన్‌,

15. ఆ. నిన్ను నీవ తెలియనేర్తువు నీ జ్ఞాన
ముననె, దేవదేవ! దనుజవైరి!
భూతభావనుఁడవు పురుషోత్తముఁడవు భూ
తేశుఁడవు జగత్పతివియు నీవ.

16. తే. ఏ విభూతల వ్యాపింతువెల్ల లోక
ములను, వానిని నిశ్శేషముగ వచింపు;
నీ నియమనవిశేషముల్‌ నీవ చెప్ప
వలయుఁ గావి, మనుష్యుల వలన నగునె?

17. తే. చిత్తమున నిన్ను సర్వదా చింత సేసి
యోగి నై నినుఁ గనుభాగ్యమొందు టెట్లు?
మఱియు నేభావముల నిన్ను మదిఁ దలంప
వచ్చునో, యవి దెల్పవే వనరుహాక్ష!