పుట:Geetham Geetha Total.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06. తే. భువనమందలిజను లెల్లఁ బుట్టి రెవరి
సంతతిగ, నట్టివారలౌ సప్తఋషులు
మనుచతుష్టయమును నాదు మనసునందె
జనన మొంది మద్భావముల్‌ సలుపుచుంద్రు.

07. ఆ. ఉర్వి నావిభూతి యోగంబు నెవఁడు ని
శ్చయ విధమున నెఱుఁగఁ జాలు, వాఁడు
నిశ్చలముగ మనసు నిల్పుయోగంబును
బొందు; దీనలేదు సందియంబు.

08. తే. అఖిలజగతికిఁ బ్రభవ మేనగుదు ననుచు
నిల సమస్తంబుఁ జెలఁగు నా వలన ననుచు
నెఱుఁగమద్భావయుతు లైన పరమబుధులు
నన్నె భజియించుచుందు రనారతంబు.

09. తే. చిత్తమును బ్రాణములు ననుఁజేరఁ జేసి
నన్నుఁ దెలిపెడునాలీల లెన్నుకొనుచు
నొకరి కొక్కరు భాషించు చుంట, నిత్య
పరవశులు గాఁగ నుంద్రు నా భక్తవరులు.

10. తే. సతతయుక్తత నన్ను భజన మొనర్చు
భక్తివరుల కవశ్యంబు పరఁగ నిత్తు
బుద్ధియోగంబు నేఁబ్రీతి పూర్వకముగ;
వారు దానిఁ గైకొని నన్నుఁ జేరఁగలరు.

11 . ఆ. అట్లు నాయనుగ్ర హమునకుఁ బాత్రులౌ
వారి హృదయపీఠిఁ జేరి నేను
జ్ఞానదీపమును బ్రకాశింపఁ జేయుచుఁ
దమమునెల్ల వెలికిఁ దఱిమివైతు.