పుట:Geetham Geetha Total.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. తే. ఏది యక్షరం బని యండ్రు వేదవేత్త
లేది గమ్యస్థలంబు జితేంద్రియులకు
బ్రహ్మచర్యంబుచే దేనిఁ బడయ నెంతు
రాపదమె యక్షరము, సంగ్రహముగ వినుతు.

12. తే. ఎల్లద్వారంబులను నియమించి నరుఁడు
మనసు బంధించి, హృది మధ్యముననె నిలిపి
ప్రాణవాయువు శిరములోపల నిమిడ్చి
యోగబలమున ధారణ బాగుపఱచి.

13. తే. బ్రహ్మవాచక మైనట్టి ప్రణవ ముచ్చ
రించుచును, దాన నన్ను ధ్యానించుకొనుచు,
కాయమును విసర్జన సేయఁ గలిగెనేని
యరుగఁగలఁ డాతఁ డుత్కృష్టమైనగతికి.

14. తే. వేఱుచింతల మనసునఁజేరనీక
సర్వదా నన్నె యెవ్వండు స్మరణసేయు,
నట్టివానికి సులభుండనగుదు నేను;
యోగి యాతఁడె, మఱి నిత్యయుక్తుఁ డతఁడె.

15. తే. శ్రేష్ఠమైనట్టి యోగసం సిద్ధి పడయు
జనులు ననుఁ బొంది, పిమ్మటఁ గనరు దుఃఖ
భాజనంబులు నస్థిరభంగురంబు
లౌపునర్జన్మములను బలారితనయ!

16. ఆ. బ్రహ్మలోక మాది పరఁగెడుసర్వలో
కములు మరల జన్మ మమరఁజేయు;
నన్నుఁ బొందునట్టి నరులు పునర్జన్మ
మందఁబోరు మరల ననఘచరిత!