పుట:Geetha parichayam Total Book.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పాలంటే ప్రొద్దుపోక జూదమాడి పెట్టుకున్న యుద్ధమని అందరికి తెలియును. ఆ యుద్ధము కురుక్షేత్రమందు జరిగినది. ఆ కురుక్షేత్రమును ధర్మక్షేత్రమనుట కూడ జరిగినది. వాస్తవానికి కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా అన్నది ప్రశ్న, దానిని పరికించి చూస్తాము.

ప్రపంచములో మొదటి నుండి బీదవానికొక న్యాయము, ధనికునకొక న్యాయము సహజముగనున్నది. పేదవాడు చిన్న తప్పుచేస్తే వానిని తప్పుడు వానిగ ప్రచారము చేస్తారు. అదే ధనికుడు చేస్తే వానినలా అనక వాడు చేసిన తప్పును కూడ సమర్థిస్తారు. ఒక ఊరిలో ఒక పేదవాడు ఒక స్త్రీతో అక్రమసంబంధము ఏర్పరచుకొంటే వానిని తిట్టిన ప్రజలే, అదే ఊరిలో అదే పనిని ఒక ధనికుడుచేస్తే వాడు మగవాడు ఏమి చేసిన తప్పులేదన్నారు. ఇట్లు అనేక చోట్ల అనేక విధముల తప్పులను ధనికుల ఎడల ఒక విధముగ, పేదల ఎడల మరొక విధముగ మాట్లాడడము జరుగుచున్నది. నాకు తెలిసిన మరొక వ్యక్తి జూదమాడి ఉన్న ఆస్తినంతయు పోగొట్టుకుంటే అతనిని ఛీ అన్నారు. అట్లన్నవారే ఆస్తిని మరియు భార్యను కూడ జూదములో పెట్టి ఓడిపోయిన ధర్మరాజును ధర్మపరుడన్నారు. ఇదే పేద ధనికులకుండే భేదము చూడండి.

ఆస్తిని, అన్నదమ్ములను, చివరకు భార్యను కూడ కోల్పోయిన ధర్మరాజు తిరిగి తన ఆస్తి కోసము యుద్ధమునకు పూనుకొన్నాడు. ఆ యుద్ధము ఈనాడు పంజాబ్‌ రాష్ట్రమునందు గల కురుక్షేత్రమందు జరిగినది. ఆ క్షేత్రములో ధర్మము ఈనాడుగాని, ఆనాడుగాని లేదనియే చెప్పవచ్చును. ఎందుకనగా ఈనాడు ఆ స్థలము పెద్దపట్టణముగ ఉన్నది. అన్ని స్థలములలో జరిగినట్లే అక్కడ కూడ మోసములు, కుతంత్రములు, హత్యలు, గలాటలు జరుగుచూనే ఉన్నవి. ఈనాడు సిక్కులు తమకు ప్రత్యేకమైన రాష్ట్రము కావాలని పోరాటము జరిపి ఎందరో హతమయ్యారు. ఆనాడు భూమి కోసమే యుద్ధము జరిగినది. భారత దేశచరిత్రలో ఈనాటికి, ఆనాటికి యుద్ధములో పేరుగాంచి రక్తముతో తడిసిన ఆ భూమిని ధర్మక్షేత్రమనుట సరియైన భావముకాదనియే చెప్పవచ్చును.