పుట:Geetha parichayam Total Book.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కురుక్షేత్రమును ధర్మక్షేత్రమని శ్రీకృష్ణుడు అనలేదు. మధ్యలోని వారన్నారనుకోండి. దానికి ఆ పేరు తగునా, తగదా అను ప్రశ్నను వేసుకొని యోచించాలి. ముందు ధర్మమంటే ఏమిటో తెలియాలి. ధర్మమంటే పలానాయని తెలిసినపుడే అది ధర్మక్షేత్రమా కాదా అను వివరము మనకు తెలియగలదు. అదియును కాక ధర్మయుక్తమైన భగవద్గీతను తెలుసుకొనుటకు ముందు ధర్మములను గూర్చి కొద్దిగ అయిన తెలిసి ఉండాలి. అలాంటపుడే గీతలో ఇవి భగవంతుడు చెప్పిన ధర్మయుక్తమైన వాఖ్యములని, ఇవి మనుజులు చెప్పిన అధర్మ యుక్తములైన మాటలని గుర్తించుటకు వీలగును.

జడ్జీల మీటింగులో మంత్రిగారు ఉపన్యసిస్తూ న్యాయమును నిర్ణయించి తీర్పు చెప్పు న్యాయమూర్తులను ధర్మపరులని వర్ణిస్తు, మీరు ధర్మము ప్రకారము తీర్పులు చెప్పుచు ధర్మమును కాపాడవలసినది మీ చేతులలో ఉన్నదని, ఏ ప్రలోభములకు లొంగకుండ ధర్మమును నిర్వర్తించాలన్నాడు. ఇక్కడ మంత్రిగారు న్యాయమును, ధర్మమును రెండిటిని కలిపేసి న్యాయమూర్తులను ధర్మమూర్తులు అన్నారు. అలాగే చాలామంది ప్రజలు కూడ న్యాయము, ధర్మము ఒకటేనని తలచి న్యాయమని చెప్పు సందర్భములలో ధర్మమను పదము వాడుచున్నారు. ఇది ప్రజల పొరపాటైతే ఇక స్వాములైన వారు జ్ఞానము, నీతి రెండు ఒకటేనని తలచి, వారు జ్ఞానము చెప్పవలసిన సందర్భములలో నీతిని చెప్పుచున్నారు. ఇట్లు ప్రజలకు న్యాయధర్మముల వ్యత్యాసము తెలియక పోగా, జ్ఞానము, నీతి వ్యత్యాసములు స్వాములకు కూడ తెలియకుండ పోయినవి.

నీతి, న్యాయములు ఒక జాతి కాగ, జ్ఞాన, ధర్మములు మరియొక జాతి అగును. నీతి, న్యాయము ప్రపంచ సంబంధము కాగ, జ్ఞాన, ధర్మములు పరమాత్మ సంబంధమగును. నీతి న్యాయయుక్తమైతే, జ్ఞానము ధర్మయుక్త మగును. నీతిని ఆచరిస్తే న్యాయమగును, అవినీతిని ఆచరిస్తే అన్యాయమగును. అట్లే జ్ఞానమునాచరిస్తే ధర్మమగును. అజ్ఞానమునాచరిస్తే అధర్మమగును. నీతి న్యాయములాచరించడమును బట్టి పుణ్యము, అవినీతి అన్యాయముల