పుట:Geetha parichayam Total Book.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూరముగ కురుక్షేత్రమందు జరుగు యుద్ధమును సంజయుడు చూడగల్గుచున్నాడను కొందాము. అక్కడ ఆయనకు కనిపించునది కేవలము ప్రకృతి దృశ్యము. అక్కడున్న మనుజులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములే కనిపిస్తాయి. నేడు మనము చూచితే దగ్గరున్నవి మాత్రమే కనిపించును. ఆనాడు సంజయుడు చూస్తే దగ్గరున్నవి కాక దూరమున్నవి కూడ కనిపించాయట. అలా చూడగల్గు శక్తి ఆనాడు సంజయునికుండెడిదనుకొందాము. దూరముగ యుద్ధరంగములో గల అర్జునుడు శ్రీకృష్ణుడు కనిపించి ఉండవచ్చును. కాని అంతరంగమున లోదృష్ఠియైన జ్ఞానదృష్ఠికి కనిపించు పరమాత్మ దర్శనమెలా కనిపించింది? సంజయుడు యుద్ధరంగము మొదటి నుండి చూచాడన్నపుడు ప్రకృతి సంబంధమైన బయటి దృశ్యములే కనిపించియుండును, కాని పరమాత్మ దర్శనము కనిపించి ఉండదని తెలియుచున్నది.

ఇక్కడ కొందరికొక అనుమానము కూడ రావచ్చును. అది ఏమనగా! శ్రీకృష్ణుడు రాయబారము కొరకు కౌరవసభలోనికి పోయినపుడు, అచట దుర్యోధన దుశ్శాసనులు మొదలగువారు తాడుతో బంధించవలెనని రాగ, ఒంటరియైన శ్రీకృష్ణుడు వారి తాళ్లకు బంధింపబడక విశ్వరూపము చూపాడు కదా! అపుడు కన్నులు మిరుమిట్లు గొల్పు ఆ రూపమును చూడలేక వారు క్రిందపడిపోగ, ఆ రూపమును చూడవలెనను ధృతరాష్ట్రుని కోర్కెమేరకు శ్రీకృష్ణుడు ఆయన అంధత్వమును తీసివేసి కన్నులు కనిపించునట్లు చేశాడని, మరియు అపుడే ధృతరాష్ట్రుని భార్య గాంధారిదేవి కూడ తన కళ్లకు కట్టుకొన్న గుడ్డ తీసి విశ్వరూపము చూచినదని విన్నాము. ఆనాడు అందరు మామూలు కన్నులతోనే కదా! విశ్వరూపమును చూచినది. అటువంటపుడు యుద్ధ సమయములో అర్జునునికి చూపిన విశ్వరూపమును సంజయుడెందుకు చూచియుండడని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! వారి మాట ప్రకారము దూరముగనున్న సంజయునికే విశ్వరూపము కనిపించియుంటే అచటనే దగ్గరలో నున్న సైన్యమునకు, ఇటు పాండవులకు, అటు కౌరవులకు అందరికి కనిపించియుండాలి. అట్లు అందరికి కనిపించినట్లు ఋజువే లేదు.దగ్గరున్న