పుట:Geetha parichayam Total Book.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వారికే కనిపించని విశ్వరూపము దూరముగ ఉన్న సంజయునికి కనిపించిందనడము పూర్తి అసత్యము. అట్లే రాయబారమున విశ్వరూపమును కొందరు చూచుట, కొందరు చూడకుండ పోయారను మాట కేవలము అభూత కల్పనయే గాని నిజము కాదు. ఆత్మ, పరమాత్మలు ఇంద్రియాలకు అగోచరమైనవి. కంటికి కనిపించవు, చెవులకు వినిపించవని భగవంతుడు గీతయందే తెలిపియున్నాడని మరువకూడదు. అలా తెలిపియుండగ పరమాత్మ స్వరూపమైన విశ్వరూపము కంటికి కనిపించిందనడము ధర్మవిరుద్ధమైన మాట. కనిపించినదని చెప్పువారుంటే భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయములో నాల్గవ శ్లోకమున "మయాతత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా" ఇంద్రియములకు కనిపించక ఈ ప్రపంచమంతా నేను వ్యాపించియున్నాను. అని ధర్మయుక్తముగ చెప్పిన భగవంతుని మాటకే వ్యతిరేఖముగ చెప్పినవారగుదురు. అందువలన గీతను జాగ్రత్తగా పరిశీలించి ధర్మబద్దముగ చెప్పాలంటే, సంజయుడు తన కన్నులతో విశ్వరూపమును ఏమాత్రము చూడలేదు. రాయబారమున విశ్వరూపము చూపుటకు అదేమైన గారడివిద్య లాంటిదా! అవసరమొచ్చినపుడంతా విశ్వరూపము చూపితే దానికి విలువుంటుందా! అలా చూపించునదేయైతే విశ్వరూపసందర్శన యోగములో 47వ శ్లోకమున "నీవు తప్ప మరి ఎవ్వరును దీనిని చూచిన వారు లేరు" అను మాట మరియు 52వ శ్లోకమున "అర్జునా ఈ రూపమును చూడవలెనని దేవతలు కూడ కోర్కె కలిగియున్నారు. అయినను నీవు తప్ప ఎవరును దీనిని చూచిన వారు లేరు". అను మాట పనికిరానిదై పోవును. అలాంటపుడు భగవంతుడు పల్కిన మాట నిజమా లేక మానవులు చెప్పిన మాట నిజమా అని పరిశోధించి చూచితే, భగవంతుడు చెప్పినది సిద్ధాంతపరమైన శాస్త్రవచనమని, మానవుడు చెప్పినది నిరూపణకురాని అశాస్త్రీయవచనమని తెలియుచున్నది. అలాకాక విశ్వరూపమును యుద్ధరంగములో సంజయుడు, రాయబారములో మిగతావారు, చూచారంటే ఎవరు చూడలేదను భగవంతుని మాట అసత్యమై మొత్తము భగవద్గీతయే అసత్యమగును.