పుట:Geetha parichayam Total Book.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆకారమును కల్పించి చెప్పారు. అక్కడ వారు చెప్పినట్లు కోరలు, ముఖము, నోరును చిత్రించుకొంటూ పోతే పరమాత్మ రూపము వికృతమైన పెద్ద పిశాచి ఆకారమును పోలియుండును. అలాంటిదా పరమాత్మ ఆకారము? దీనికేమి సమాధానము చెప్పగలరు? దేవుడు పల్కిన "చాతుర్వర్ణము" అను మాటకు వివరము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులని కులముల పేర్లు చెప్పి కుల,మత భేదములు కల్గించు అజ్ఞానుల మాటలవలె దేవుని మాటలను తీర్చిదిద్దారు. వారి మాటల ప్రకారము భూమి మీద హిందూమతమునకే సంబంధములేని మతములలోని మనుజులలో పై చెప్పిన నాల్గుకులములు లేవే! వారిని ఏ దేవుడు సృష్ఠించాడు? ప్రపంచమంతా ఒకే దేవుడైనపుడు చాతుర్వర్ణమను మాట వారికి వర్తించదా? ఈ నాల్గుకులాలు లేని దేశములెన్నో ఉన్నాయి. వారిని సృష్ఠించిన వాడు ఎవడో చెప్పగలరా?

గీతయందు జ్ఞానయోగమను అధ్యాయము మొదటిలో ఆదియందే సూర్యునికి చెప్పియుంటినని భగవంతుడు చెప్పినపుడు, సూర్యుడొక మనిషికాదు కదా! అది ఒక గోళము గదా! అలాంటి గోళమునకెట్లు చెప్పాడు? ఎంతో దూరమునున్న సూర్యుడెట్లు వినగలిగాడు అను ప్రశ్నకు జవాబు చెప్పగలరా? ప్రకృతి చేత పుట్టినది, ప్రకృతి సంబంధమైనది శరీరమని, శరీరములోని కదలికశక్తి పురుషుడైన పరమాత్మదని, గుణత్రయ విభాగయోగములో 3,4 శ్లోకములలో ఉండగ, ప్రక్క అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తియోగములో 16,17 శ్లోకములలో క్షర అక్షర పురుషోత్తములుగ పురుషున్ని మూడు విభాగములు చేసి చెప్పియుండగ, ఆ శ్లోకముల వివరము కేవలము పురుషునికే చెప్పక ప్రకృతి సంబంధమైన శరీరమును ఎందుకు తీసుకొన్నారని అడిగిన జవాబు చెప్పగలరా? ఇంతవరకు ఎందరిచేతనో వ్రాయబడిన గీతలలో ఇటువంటి ప్రశ్నలుగ మిగిలిన విషయములెన్నో కలవు. కనుక ఇప్పటికైన మేల్కొని, పవిత్రమైన కాలమును వృథా చేయక, జ్ఞానము సముద్రములాంటిదని, దానిలో ఇంకా మనకు తెలియని విషయములెన్నో కలవని, తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.