Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనకభిరుచి జనించి వారి తళుకులు, బెళుకులు, హోయలు, యొయ్యారములు, నవ్వులు, పరియాచికములు, విచారములు, కష్టసుఖములు మొదలగు వాని యందు సానుభూతి జనించి ఆ అచ్చటలను ముచ్చటలను ఆనందదాయకముగా వీలయినంత వరకు వారు మాటలాడుకునే శబ్దార్థాద్యలంకార రహితమగు శైలిలో చెప్పెడి ప్రశంసలకే సాంఘిక నవలలని పేరు. అట్లని శైలి అల్పులు, నీచులు కూడ మాట్లాడెడి రీతిని హేయపద భూయిష్టమై యుండకుండా సఖ్యమై వెగటు పుట్టించ కుండిన చాలును. ఇట్టి నవల కుండవలసిన ముఖ్య లక్షణమేమన కథ యే కాలము నాటిదని మనము చెప్పుచున్నామో, ఆ కాలము నాటి మాటవడుపు, యాస, మర్యాదతీరు స్థలాదుల చిత్రము కళ్ళకు కట్టినట్లగుపడవలెను. ఇట్టివన్నియు పురుషాంతరమునున కొకసారియైన నచ్చముగ మారిపోవుచుండును. సాంఘిక నవలయనిన కథ చెప్పుట కాదు. కథ చెప్పుటకెట్టి శైలియైనను నొకటే. యెట్లు వర్ణించిననునొకటే. సాంఘికనవలయనిన కథను చిత్రించుట. ఇట్టి చిత్రమున కెక్కడనుండవలసిన రంగు, నీడ, కాంతి అక్కడ సరిగ నుండిననే చిత్రము సరియైనదగును కాని సంఘమర్యాదలు, వివరములు, స్థలము యొక్క తాత్కాలిక విచిత్రములు, మొదలగు వానియందు లక్ష్యము లేక లేఖకుడు తన కల్పనలతో నవిచ్చిన్నముగ విజృంభించినచో ఏదో యొక చిత్రము తయారయి ఏదో యొక వింతగొలిపి మోహింప జేయునే కాని అది సంఘ చిత్రము కానేరదు.

సంఘ చిత్రము సరియైనదై యుండవలెను. అనగా సత్యమైనదై యుండవలెను. సత్యమనగా ఇక్కడ బ్రహ్మపదార్ధమును గూర్చిన సత్యము వంటి విశేష సత్యము కాదు. ఆ సత్యము దేశకాల పరిస్థితుల వలన బాధింపబడినది. ఈ సత్యము దేశకాల పరిస్థితుల మార్పు వలన బాధింపబడు సామాన్య సత్యము. స్థలములు నేడున్నట్లు మరి పదియేండ్ల తర్వాత నుండవు .మాట తీరులు, అలవాటులు, మర్యాదలు, ఆచారములు తాత్కాలిక చరిత్రాత్మకమగు విశేషములు మొదలగునవి కూడా నేడున్నట్లు ఒక పురుషాంతరము తరువాత నుండబోవు. ఈ చిత్రమును మనము కన్నులార చూచుచు చిత్రించినవే సరియైన సత్యమైన చిత్రము చిక్కును కాని ఊహాప్రపంచము నుండి కల్పనలను తీసుకొని వచ్చి చిత్రించినచో అది కృత్రిమము కాకమానదు. కనుక సాంఘిక నవల గ్రంథకర్త తన కన్నుల

గరిమెళ్ళ వ్యాసాలు

61