పుట:Garimellavyasalu019809mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'నూతన సాహిత్య విజృంభణము ' (1928) వ్యాసంలో కవిత్వం గురించి రాస్తూ "వ్యర్ధ పద్య ప్రచురణ మెక్కువై నోటిలో నుంచి వచ్చెడి తుంపురలు అచ్చు పడుచున్నవేయని విచారింపవలసి వచ్చినది. " అని ఘాటుగానే విమర్శించారు. భావకవిత్వపు స్వర్ణోత్సవ కాలంలో అందుకు భిన్నంగా జాతీయ భావనతో సమరగీతాలురాసి ప్రచారం చేస్తూనే భావకవిత్వాన్ని పై విధంగా విమర్శించడం గరిమెళ్ళ సాహిత్య దృక్పధం తేటతెల్లం అవుతుంది.

భక్తిభావాలకి పరిమితమైన గీతకవిత్వం దేశభక్తికోసం నడుం కట్టాలని చెప్పారు. 'సాంఘిక నవల ' (పే.65) వ్యాసంలో 'శైలికవికినైజమైఉండాలం ' టారు. 'పల్లెటూరి కధలు ' (పే.54) సమీక్షలో రచయిత అందమైన ఉన్నతవర్గం వారిని కాకుండా కింది వర్గం వారిని గురించి రాయాలని హెచ్చరిస్తారు. వాడుక భాష వల్ల జనసామాన్యభాష సాహిత్యంలోకి వస్తుందనీ అందుకు స్వాగతం పలకాలనీ అంటారు.

నాటి సాహిత్యవాతావరణంలోని లొసుగుల్నిఎత్తిచూపుతూనే సాహిత్యం నిర్వహించాల్సిన విధిని నొక్కి చెప్పారు. రచయిత బాధ్యతని ఆయన మాటల్లోనే చూద్దాం.

కేశవరంలో ప్రోగ్రెసివ్ రైటర్ల మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ (పే.86) "మనకూ, కేవలం సాహిత్యలేఖకులకూ గల వ్యత్యాసం ఏమంటే వారు పరిశుభ్రమైన సోపానకులును, కళాభిమానులును అయి వుండగా మనము కళలను ప్రజాసేవకు, విజ్ఞానమునము, దేశపురోభివృద్దికి వినియోగించుటకై తయారై ఉన్నాము" అంటారు.

సాహిత్యం సాహిత్యం కోసమే అని కాకుండా అది ప్రజాభివృద్దికొసం అని నమ్మి దాన్ని ఆచరించినవారు గరిమెళ్ళ. తాను వ్యక్తం చేసిన ఆలోచనల్లోని అభివృద్ధికరమైన అంశాల్ని ఈనాటికి గ్రహించవలసిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈవ్యాసాల అవశ్యకతని గుర్తించక తప్పదు.

కవిగా, రచయితగా, ఒక వ్యక్తిగా గరిమెళ్ళ స్పురణ, ప్రేరణ ఈనాటి పరిస్థితులకి మరింత అవసరం. అందుకే ఈ వ్యాస సంకలనం.

--జయధీర్ తిరుమలరావు డైరెక్టర్, ప్రచురణ శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం