పుట:Garimellavyasalu019809mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటలు ఆపేసి భుక్తికోసం, తనభావాల అభివ్యక్తీకరణకోసం ఎక్కువగా రాజకీయ వ్యాసాలు రాశారు. అంతకుముందు భారతి, కృష్ణాపత్రిక ఇత్యాదుల్లో సాహిత్య వ్యాసాలు ప్రచురించారు.

గొప్ప కవీ కళాకారుడు తన కాలం నాటి స్థితిని సిద్ధాంతీకరించడానికి విపులమైన రచనలు చేయకతప్పదు. తనలోని సరికొత్త అనుభవం, సామాజిక పరిస్థితి, అవసరాల రీత్యావివరణ ఇచ్చుకోక తప్పదు. అట్లాంటి వివరణే వ్యాసాల రూపంలో గరిమెళ్ళ ప్రచురించారు. ఈ వ్యాసాలు చాలా వరకు అంతకు ముందు తను రాసిన గేయాలలో తాను విడమరిచి చెప్పలేని అంశాలే కనిపిస్తాయి. ఐతే గేయాల్లో కనిపించేంతస్పష్టమైన తాత్వికత వ్యాసాల్లోకనిపించకపోయినా గరిమెళ్ళ ఆలోచనలు ఏమిటో, అతనే వైపో తెలిసిపోతుంది. తానున్నసమాజంలో అన్యాయం రూపుమాపి ఒకానొక సామ్యవాద వ్యవస్థ నెలకొనాలనీ, అది భారతదేశస్థితిగతులకు అనుగుణమైన దేశవాళీ సిద్ధాంతం వల్లే సాధ్యమవుతుం దనేది ఆయన భావన గరిమెళ్ళ ప్రజలను పాటల ద్వారా మేల్కొలిపారు. మేల్కొన్న తరువాత వాళ్ళు నడిచే మార్గాన్ని నిర్దేశించలేదు. నాటి దేశ రాజకీయాల దృష్ట్యానే వాళ్లని జాగృతం చేయాలన్నది అప్పటి ఆయన ఏకైక లక్ష్యం.

జాతీయోద్యమం ఎన్నోఆటుపోట్లకి గురవుతూ విమర్శలకి లోనవుతుంటే ఆ విమర్శలలోని వాస్తవాలను పరిశీలించారు. ప్రతి సమస్యనీ, విమర్శనీ ప్రజాదృక్పధం నుండి చూశారు తనని తానుకూడా ఆ ప్రజారాశిలో ఒకనిగా భావించారు. అంతేకాని ఆప్రజలకన్నా ఉన్నతునిగా ఎన్నడూ ఎక్కడా అనుకోలేదు. అందుకే అన్ని కష్టాలను, అంతదారిద్య్రాన్ని అవలీలగా ఎదుర్కోగలిగారు. తాను త్యాగం చేస్తూ ప్రజలనూ, పరిపాలకులనీ త్యాగం చేయాలనే ఉద్భోద చేశారు. తనలాగే ధనికులు కూడా మౌలికావసరాలు తీర్చుకొని తమ అదనపు ఆస్తిని ప్రజలకి పంచాలని ఆశించారు. ఐతే ధనస్వభావ దుర్గుణాన్ని (అంతర్జాతీయంగా కూడా) అంచనవేయడంలో మాత్రం పొరబాటు పడలేదు.

ఇక సాహిత్య వ్యాసాల గురించి-

శనివారపు సుబ్బారావు గారు వ్రాసిన 'పల్లెటూరి కధలు ' గ్రంధ సమీక్షని కూడా వ్యాసంగా గ్రహించి సంకలన కర్త ఇందులోచేర్చారు.