పుట:Garimellavyasalu019809mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవలలను కుప్పలు తిప్పలుగా తర్జుమా చేసినారు, చేయుచున్నారు. ఆంధ్ర ప్రచారిణీ గ్రంధమాల, సరస్వతీ గ్రంధమాల మొదలగు గ్రంధమాలలెన్నియో రెండేసి మాసముల కొక నవల చొప్పున దించి ఆంధ్రుల హస్త పద్మముల కర్పించుచున్నారు. గ్రంధాలయము లూరూరా వెలసినవి. ఆంధ్రులలో గ్రంధ పఠనాశక్తిహెచ్చినది కాని దినదినమునకు భాషాంతరీకరణములై మన భాషలో పడుచున్న యీ నవలలే మన దేశమునందు స్వతంత్ర గద్య కావ్య రచనము లేక నవల రచన మింకను ఎట్లు ఉద్బవించనే లేదో తెలియజేయుచున్నవి. ఎవ్వరిని జూచినను ఏదోయెక క్రొత్త భాష నభ్యసించుచు, అందులోనుంచి కూడబలుకు కొనుచు ఒక నవలను భాషాతరీకరించిచున్నవారే. ఆంధ్రులలో స్వతంత్ర గద్య కావ్యములుదయించుట కింకను నెంతో కాలము గడువవలెను కాబోలును రాయచూరు యుద్ధము, విజయనగర సామ్రాజ్యము, లక్ష్మీప్రసాదము మొదలగు నవి కొన్ని స్వతంత్ర కావ్యములు కలవు కాని అవి క్రొత్త రచనలకు మార్గదర్శకములైనవి కావు. నవల యనగా ప్లాటు నొకటి పెట్టి కధనల్లి వేయుట కాక సమకాలిక సాంఘిక జీవనమును చిత్రించుటయై యున్నది. అట్టి నవలలొకటి కాక రెందు తప్ప ఆంధ్రజీవనమును చిత్రించునవి లేనేలేవు.

ఆఖ్యాయికలు

   గద్యకావ్వములలో రెండవ విదానము చిన్ని కధ (Small story) బంగాళా భాషలో ప్రేమచందు యిట్టి కధల నెన్నింటినో వ్రాసెను. అవి మన భాషలోకి తర్జుమా అగుచున్నవి. మరియు నితర భాషలలో నుంచి కూడా తర్జుమా అగుచున్నవి. చిన్న కధ యొక్క చాతుర్యమెల్లను ఒక మనుజుని జీవితమును ఆఖ్యానములో నుండి యెక్కడ నుంచియో మొదలు పెట్టి చిత్రముగా కొంత వరకు తీసుకొని వెళ్ళి యెక్కడనో అద్భుతముగా నాపివేయుటలో నున్నది. ప్రతి మనుష్యుని జీవితమునందును వట్టి యద్భుతములు జరుగుచున్నవి. అట్లు ప్రదర్శింపవచ్చును. కాని ఆ అద్భుతమును గ్రహించి చిత్రించగల సూక్ష్మబుద్ది గల్స కధకుడు కావలసియున్నాడు. ఆతడు వచ్చే లోపల ఈ యద్భుతము ప్రాతగిల్లి పొవును లేదా మఱపు వడును. దానిని చిత్రించుటకు గూడ గద్యకవులు కావలసి యున్నారు.