పుట:Garimellavyasalu019809mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణములైకై ప్రయత్నించిరి కాని, అతని తరువాతి వారు దానిని కేవలము కృత్రిమమని త్రోసి వేసి అతనికి గల ప్రాముఖ్య మెల్ల అందుకొరకై కాక వానికి విరుద్ధమైన దాని కొరకేయని కృతనిశ్చయులైరి. ఇతని తరువాత నట్టి లక్షణములు గల గద్య కావ్యములను వ్రాసినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహంగారే వీరు తెలుగులో స్వతంత్రములగు గద్య కావ్యములు వ్రాసి విస్తారమగు సాహిత్యము సృష్టించి కీర్తి పట్టము గట్టుకొని విద్యా వయోపవృద్ధులై విశ్రామము తీసుకొనుచున్నారు. ఆ తరువాత స్వతంత్రములగు గద్యకావ్యములను వ్రాయగల శక్తి తెలుగు విద్యావంతులలో నస్తమించినది. పద్య కావ్యములలో రవీంద్రుడును, ఆంగ్లేయుల Minor Poems ను శరణ్యము లైనట్లే గద్యకావ్యములలో బంగాళ నవలాకారుల తర్జుమాయున్ను, అయిరోపియ నవలాకారుల ప్లాటులున్ను (plots) శరణ్యము లైనవి. ఈ లోగా స్త్రీలలోనేమి, చదువురాని జాతులలో నేమి విద్య యెక్కువై పఠనజ్ఞానము వ్యాపించినది. ఆంగ్లేయ పాఠశాలలోనేమి కచేరీ సావిళ్లలోనేమి కొలువులు సేయుచు తీరుబాటు లేని విద్యాధికులకు పరిశోదనము విమర్శనము మొదలైన పరిశ్రమలు సేయుట కవకాశములు చిక్కలేదు. గాని, ఏకొలువులోనో కాలక్షేపము సేయుచు అప్పుడప్పుడొక శాస్త్రీయ గ్రంధమును వ్రాయుటకును, ఒక నవల నేభాషనుండియైనను తర్జుమా చేయుటకును plot ను త్రిప్పి వ్రాయుటకును వున్నచో బుద్దిమంతులకును ఓపిక కలవారికిని తప్ప సాధ్యముకానివి. కాని హిందూ దేశపు భాషలలో దేనినైనా సంపూర్తిగా నేర్చుకొని అందులోంచి నవలలను తెలుగులోనికి తర్జుమా చేయుట పెక్కు జనులకు సులభ సాధ్యమైన పని. వంగదేశీయులు పద్య కవిత్వమునందే కాక నవల రచనము నందును పేరెన్నిక గని యుండిరి. మధ్య యుగము నాటి బుందేలుఖండ చరిత్రను రసవంతములగు నవలలుగా వారు వ్రాసిరి. అవి కన్నడ భాషలోనికి కూడా తర్జుమా అయినవి. కొందరు కన్నడమును సుళువుగా నేర్చుకొని వాటిని తెలుగు చేసిరి. కొందరు బంగాళ, మహారాష్ట్రము, హిందీ మొదలగు భాషలనే స్వయముగా నభ్యసించి వాటిలో నుండు