పుట:Garimellavyasalu019809mbp.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టూకీగాను సులభముగాను నుండును కాని వర్ణనములను ప్రారంభించెడి చోట్ల ప్రబంధవచనముల యమకరణములుగా నున్నవి. అయినను వాటికిని వీటికిని భేదము లేకపోలేదు. ప్రబంధములు కేవలము పాండిత్య ప్రదర్శనము కోసము, పండితులకి తెలియడము కోసము, పామరులకు తెలియవలెననెడి సంకల్పమేమీ పెట్టుకోకుండా వ్రాసినవి ఈ కధలట్లు కాదు. పెద్ద పాండిత్యము లేక యించుకంత చదువుకొని విలాసముగ కాముకులై వీధులలో తిరుగువారి కొరకుగాని, చోరత్వములోగల నెరజాణతనముల నెల్ల స్వైరవిహారిణులెఱింగి యానందించు కొనుటకు గాని, లోకములో జరుగ గల యద్భుతములను తెలిసికొన సువ్విళు లూరు చుండునట్టి కొంచెము మట్టుగ చదువుకొన్న వారు పఠించుకొనుటకు గాని వ్రాయబడిన గ్రంధములు అట్లైనను, వాటిని హృదయరంజకముగను, భావమును ఉద్రేకించునట్లుగను, ప్రకృతిని చిత్రించు నట్లును అద్బుతమును ప్రసాదించునట్లును చేయవలెనని తలచి ప్రబంధ వచనముల పోకడ నందు చొప్పించనిదే దానికి కావ్య ప్రపంచములో నుండదగినంత ఘనత రాదని యూహించి విద్వత్కధకులు వ్రాసిన వే యవ్వి, ఇందు చేతనవి ఉత్తమ వర్ణనలు, మధురశైలి, సులభ కధనము మొదలగు లక్షణములతో గూడి ఇప్పటి నవల ప్రపంచమునకు జనకుడవదగు శైలిలొ నున్నవని చెప్పవచ్చు దేశ చరిత్రములు, విమర్శనములు, సమాచారములు, శాసనములు, పత్రములు, ఉత్తరములు మొదలగు వ్యావహారిక గ్రంధములుగా గాక రసవంతములై హృదయములలో సంచలనాదులు కల్పింప వలసిన శైలి కావలెనన్నచో ఆశైలి మన కెంతమాత్రమును తిరస్కరిణీయము కాదు. ఇవి కావ్యములకా కావ్యములు, చదువుకొనగల వారు పఠించుటకుదగిన కధలకా కధలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి నవల శైలికి దీనికి చక్కని సంబంధమున్నది. ఈశైలి నోటికి వచ్చినటులెల్ల వ్రాసుకొని పోవుట కాదు. డెందములొ నుదయించెడి భావముల నెల్ల సుందర పదములతో చిత్రించి వినువారి వీనులను రంజింపజేయవలె ననెడి యభిలాషతోను, సుందర దృశ్యములను వర్ణించవలసిన యవకాశములు చిక్కినప్పుడెల్లా చేయి విరచుకొని యూరకొనక శాంతముగను ఆమూలాగ్రముగను దానిని వర్ణించి కధ కట్టి దృశ్యములతో గల సంబధముల నతికి రంజింపగ జేయు చాతుర్యముతోను వ్రాయబడిన శైలి యది. దీనికి ధోరణి యొక్కటియే ప్రధానముకాదు.