పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలయ ప్రత్యేకతలు

కళలన్నింటికీ నిర్మాణ శాస్త్రాన్ని తల్లిలాంటిది ( Architecture is mother of all arts) అంటారు. మరీ ముఖ్యంగా దేవాలయ నిర్మాణాలలో జీవితంలోని అనేక కోణాలను రూపించారు. మానవుడు ప్రప్రథమంగా అభ్యసించిన కళ శిల్పకళే అనడంలో అతిశయోక్తి ఏమీలేదు. ప్రాచీన శిలాయుగంలోని ఆదిమానవులు జంతువులను వేటాడేందుకు,మాంసాన్ని కోయడానికి ఆత్మరక్షణకూ అనేకరకాల రాతిపనిముట్లను తయారు చేసాడు. ఈ ప్రక్రియనుండే శిల్పకళ ఉద్భవించింది.

మూల విరాట్టు బృహత్ శివలింగం

కూనుమంచి గణపేశ్వరాలయంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం మూలవిరాట్టుగా వున్న అతిపెద్ద శివలింగం గురించే. ఆకారంలో పెద్దగా వుండటమే కాకుండా నిర్మాణంలోనూ చాలా ప్రత్యేకతలు ఈ శివలింగంలో వున్నాయి. దీనిని నల్ల గ్రానైట్ రాయి లేదా నల్ల సేనపు రాతి(డోలరైట్)తో చేసి వుంటారు. ఇది చాలా కఠినమైన రాయి అయినా సరే శిల్పులు నునుపుదేల్చి లోహపు అద్దంలా తీర్చిదిద్దారు. భూమి పైననే సుమారు ఏడడుగుల పైన ఎత్తువుంటుంది. వెయ్యిస్తంబాలగుడి, రామప్ప, పిల్లలమర్రిలలో ఇదే ఆకారంలో వున్న శివలింగాలున్నాయి కానీ ఇంత పరిమాణంలో లేవు.

బాహ్యనేత్రాలకు అంతర్లింగం, అంతర్నేత్రానికి బృహద్లింగం

గుడిలో మామూలు సందర్శనకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే కేవలం గర్భగుడిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం కనిపిస్తుంది. అది నునుపుదేలిన లోహరూపంలో దర్పంగా హుందాగా నిలబడినట్లు ఉంటుంది. గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవాలయాన్ని అంతర్నేత్రంతో పరికిస్తే, విహంగ వీక్షణ రూపంలో చూపును సారిస్తే మొత్తం దేవాలయమే ఒక మహాలింగంలా కనిపించటం ఇక్కడి అద్భుతం. సాధారణంగా గుడి గోపురాలను కోసుగా పైకి తీసుకెళుతూ కడతారు. కానీ ఈ దేవాలయ గర్భాలయ గోపురం ఒక సంక్లిష్ట నక్షత్రాకారంగానూ, లింగాకారంగానూ కనిపిస్తుంది. గుడిని నిలబెడుతూ నిర్మించిన ప్రదక్షిణాపథం దక్షిణం వైపు నుంచి విహంగవీక్షణ(ఏరియల్ వ్యూ) చేస్తూ గమనిస్తే పానవట్టం లాగా అనిపిస్తుంది, తూర్పువైపు క్రిందకి వున్న మెట్లదిశ పానవట్టం చివరి భాగం గానూ అర్ధమై మనకి ఆశ్చర్యాన్నికలిగిస్తుంది.