పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దేవాలయాలు కట్టించారు. విజయాన్ని సూచించేదిగానో పాపపరిహారంగానో దేవాలయాన్ని నిర్మించేవారు. దానితో ముడిపడి నగర నిర్మాణం మరియు అభివృద్ధి వుండేవి.

సాధారణంగా ఆలయాన్ని నిర్మించిన వారి పేరునే ఆలయాలకు పెట్టేవారు. వరంగల్లు వేయిస్తంభాల గుడిలో రుద్రదేవ మహారాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడుగా , బేతరాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు బేతేశ్వరుడుగా, పిల్లల మర్రిలో ఎఱకసానమ్మ ప్రతిష్టించిన దేవుడు ఎఱకేశ్వరుడుగా, రేచర్ల రుద్రసేనాని కట్టించిన ఆలయం రుద్రేశ్వరాలయంగా( తర్వాతి కాలంలో రామప్ప గుడి), చౌండసేనాని కట్టించినది చౌండేశ్వరాలయంగా (కొండపర్తి శివాలయం) పిలవబడ్డాయి.

అదే పద్దతిలో కాకతీయ గణపతిదేవుని ప్రతిష్టగా భావిస్తున్న ఈ ఆలయాన్ని గణపేశ్వరాలయంగా పిలుస్తున్నారు. ఇదేలా ఆలయ నిర్మాణాన్నిఇదే పేరునీ కలిగిన ఆలయం వరంగల్ జిల్లా గణపురంలో వుంది. గణపతిదేవ చక్రవర్తి పేరున క్రీ.శ. 1234లో జయ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బృహస్పతి వారం రోజున గణపురం(గణపవరం), గణపేశ్వరాలయం(కోటగుళ్లు), గణపసముద్రం(చెరువు) నిర్మితమయ్యాయి. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరిగాయట.

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం 150 సంవత్సరాల తర్వాత రాసిన ‘‘ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర’’లో అధిక సంఖ్యలో దేవాలయాల ప్రస్తావనలు కనిపిస్తాయి. నేడు అవి కేవలం పదుల సంఖ్యంలోనే మిగిలాయి. అటువంటి దేవాలయాలలో పెద్దగా చెక్కు చెదరకుండా స్థిరంగా మిగిలిన దేవాలయం కూసుమంచి గణపేశ్వరాలయం.

కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో తన విజయాలకు కారణమైన శివుడికి కృతజ్ఞతాపూర్వకంగా వేయిగుళ్లు కట్టిస్తానని చేసుకున్న మొక్కులో భాగంగానే నేటి తెలంగాణా ప్రాంతంలో అనేక కాకతీయుల నాటి శివాలయాలు కనిపిస్తుంటాయి. నిజానికి భక్తిరూపంగానే కాక ప్రజలను ఏకతాటిపై వుంచేందుకు కూడా ఆధ్యాత్మికత అనే అంశం తోడ్పడింది. బహుశా తమ వంశ చరిత్ర తరతరాలు నిలచిపోయేందుకు కాకతీయులు ఆలయాల ద్వారా ఒక మార్గాన్ని ఏర్పరచుకుని వుండొచ్చు.

అనమకొండలోని వేయిస్తంభాల గుడిని కాకతి రుద్రుడు క్రీ.శ 1162 లో నిర్మించివుంటాడని దేవాలయ ప్రాంగణంలోని నల్లరాతి స్తంభంపై రుద్రదేవుని క్రీ.శ 1163 నాటి శాసనం ఆధారంగా చెపుతున్నారు. పాలంపేటలోని రేచర్ల రుద్రుని రామప్ప దేవాలయం ఆలయ ప్రాంగణంలోని పటిష్టమైన శాసనం ఆధారంగా అది క్రీ.శ 1215లో నిర్మించి వుండవచ్చని భావిస్తున్నారు. కానీ గణపతిదేవుని కాలం క్రీ.శ 1199 నుంచి క్రీ.శ 1262