పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాలభంజికలు, మదనికలు వంటి అలంకారశిల్పాలు మాత్రం ఈ ఆలయంలో లేవు. మూలవిరాట్టుగా ప్రతిష్టించిన శివలింగం మాత్రం చాలా ప్రత్యేకమైనది, బృహత్తరమైనది. ఓరుగల్లు,రామప్పలలోని మూలవిరాట్టుగా వున్న శివలింగాల పరిమాణాలకంటే ఇది మరింత పెద్దదిగా వుంది. లోపటి శివలింగము, దానికంటే ఇక్కడే స్థూలంగా కనిపించే మరో మహాలింగం గురించి తర్వాతి వివరణల్లో తెలియజేసాను.

స్థూలంగా ఆలయనిర్మాణాన్ని గమనిస్తే కాకతీయులు భారతీయ శిల్పసంప్రదాయంలో విశిష్టమైన ‘వేసర శిల్పరీతి’ ని అనుసరించారు. ధక్షిణ భారతదేశంలో ద్రవిడ సంప్రదాయం, తూర్పు ఉత్తర భారతదేశాలలో నాగర సంప్రదాయం ప్రచారంలో వున్నప్పటికీ కాకతీయులు తమదైన ప్రత్యేకతను నిలుపుకునేందుకు వారి శిల్పరీతిలో విశిష్టతను ప్రదర్శించుకునేందుకు ఈ సంప్రదాయాన్ని అనుసరించి వుంటారు. దేవాలయం పునాదుల నిర్మాణం నుంచి శిఖరం వరకూ గల కొలతలు, గర్భాలయపు రూపురేఖల నుండి స్తంభాల విన్యాసం, రంగమండపము, ఉపరంగమండపము నిర్మాణము అన్నీ ఒకే పద్దతిలో కనిపిస్తాయి. ఇలా ఒకే పద్దతిని వారి పరిపాలనాకాలంలో నిర్మింపబడిన ఏ ఆలయానికైనా వర్తింపజేయటంతో అది కాకతీయ శిల్పమే అని కనుగొనేందుకు వీలుగావుంది. అలాగే కాకతీయ శిల్పులు ఆలయాల అంతర్భాగంలో చూపిన సున్నితమైన పనితనం బయటి భాగంలో చాలా చోట్ల చూపలేదు. అదే హోయసలులు ఆలయాల బయటివైపున పాదపీఠికనుంచి శిఖరం వరకూ ఏమాత్రం విరామం లేకుండా వారి ప్రతిభనూ, నైపుణ్యాలనూ శిల్పాలలో చూపారు. కూసుమంచి గణపేశ్వరాలయంలో లోపటి విగ్రహంలో కానీ అంతరాలయ శిల్పాలలో కానీ అత్యద్బుతమైన పనితనం కనిపిస్తుంది. కానీ బయట పెద్దగా అలంకరణలు లేవు.


కాకతీయ రాజుల నిర్మితమే ఈ ఆలయం

ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. సుమారు 300 సంవత్సరాల పాటు దక్షిణ భారత దేశాన్ని పాలించిన కాకతీయులది ఆంధ్రదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. గొలుసుకట్టు చెరువులూ, వివిధ అంశాలను విశదీకరించే అపార శిల్పసంపద, చారిత్రకాంశాలకు ఆధారాలుగా నిలచే అనేక శాసనాలు, ఆధ్యాత్మిక శోభను విస్తరింపజేసే దేవాలయాలు ఎన్నో కాకతీయుల పాలనావైభవానికి మచ్చుతునకలు.

ఆనాటి రాజులు, సామంతులూ, దండనాయకులూ యుద్ధాలలో గెలిస్తే దేవాలయాలు