పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనిలో బాగా సరిపోయేలా తయారుచేసిన యువకుడైన రామప్ప ఎంపికయ్యాడనేది ఒక కథనం. దీనిఆధారంగా గమనిస్తే గణపేశ్వరాలయ ప్రౌఢనిర్మాణ శైలికి విశ్వేశ్వరశర్మవంటి వారే కారణమయివుండొచ్చు అనిపిస్తుంది. రామప్పలోని సుందరమైన శిల్పాల నిర్మాణంలోనూ, నందివిగ్రహాన్నిజీవకళ ఉట్టిపడేలా మలచడంలోనూ రామప్ప ప్రజ్ఞాపాటవాలు, నైపుణ్యచతురత కన్పిస్తాయి. సాలభంజికల సౌందర్యారాధనలో అతని యవ్వన ప్రభావం కనిపిస్తుంది. కానీ కూసుమంచి గణపేశ్వరాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే రాతిపై రాతిని ఖచ్చితంగా పేర్చుకుంటూ రావడంలో అత్యంత నిరాడంబరమైన గాంభీర్యత కన్పిస్తుంది. ఒక ప్రౌఢత్వం ప్రస్పుటమవుతుంటుంది. అందుకే ఈ ఆలయం గణపతిదేవుని కాలంలో శిల్పి రామప్పకంటే పెద్దవాడయిన విశ్వేశ్వరాచార్యుని పర్యవేక్షణలో నిర్మించబడింది అంటే నిజమేనేమో అనిపిస్తుంది.