పుట:Ganapati (novel).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

యన్నముఁ బిల్లలకు పెట్టనెంచి యాటలు మానిపించి వాళ్ళందరి నక్కడకుఁ బిలిచి కంచములుపెట్టి యన్నపాత్రఁ జూచునప్పటి కందులో నొక మెతుకైన లేదు. ఆ యిల్లాలు తెల్లబోయెను. కుక్క తినిపోయెనేమో యని మొదట నుకొనెను. కాని నూరుఁగాయలు పచ్చళ్ళుగూడ లేకపోవుటచే నట్లనుకొనుటకు వీలులేకపోయెను. ఇంటిలోనున్న యాఁడువాండ్రంద ఱక్కడఁ జేరి కొంతసేపు మీమాంసచేసి తుదకు బ్రాహ్మణకుమారుఁడే తినియుండునని నిశ్చయించి కుఱ్ఱవాఁడు మానెడు బియ్యపన్నముఁ దిన్నందుకు మనసులో మిక్కిలి యాశ్చర్యము నొందియు, బ్రాహ్మణునకుఁ బెట్టిన తిండికి కంటగించుకొనుట దోషమని నోరు మూసికొని యూరకుండిరి. పాపయ్య చరిత్రముగూడ భీమసేనుని చరిత్రము వంటిదే, ఆఁకలిలో నిద్దఱు వృకోదరులే. ఇద్దఱు మహాకోపసులే. అయినను వేదవ్యాసునివంటి మహాత్ముఁడు తన రచనా చమత్కృతి నంతయు జూపి వర్ణించుటచే భీమసేనుఁడు వంద్యుఁ డయ్యెను. అట్టి మహాకవి యాడుకొనక పోఁబట్టి పాపయ్య నింద్యుఁ డయ్యెను. ఇట్టి యితిహాసము లనేకములు కలవు. కాని గ్రంథవిస్తరభీతిచే నవి స్పృశియింపక కథలోని ముఖ్యాంశమే వర్ణింపఁబడును. ‘తల్లి చచ్చిన జిహ్వచచ్చు’ నను నార్యోక్తి పాపయ్యకడ నిశ్చయమైనది. సరిగా నతనికన్న మమరలేదు. వండుకొను కష్ట మటుండగా ముమ్మారు మూడు మానికెల బియ్య మతనికి గావలెను. అతండులములు,